హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): హైకోర్టు సుమోటోగా స్వీకరించిన ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల తన అఫిడవిట్ ద్వారా కోర్టును కోరారు. ఇప్పుడు ఈ విషయం పోలీసు, న్యాయ నిపుణుల్లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు పర్యవేక్షణలో కేసు మరింత పకడ్బంధీగా సాగే అవకాశాలుంటాయని, అలాంటప్పుడు కేసును మూసేయాలని కోరడంలో అంతర్యమేమిటి? అన్న చర్చ జరుగుతున్నది. ఎస్ఐబీలోని సీసీ కెమెరాలు నిలిపేసి, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారనే ఫిర్యాదుపై గత మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసులో ఫోన్ ట్యాంపింగ్ విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు సంచలనంగా మారింది.
రాజకీయ నాయకులు, వారి కుటుంబీకులు, జర్నలిస్ట్‌లు, జడ్జీలు ఇలా చాలమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పోలీసులు లీక్‌లు ఇచ్చారు. మీడియాలో పలు కథనాలు రావడంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు డీజీపీ, హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ (పొలిటికల్), హైదరాబాద్ సీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గత నెల 29న హైదరాబాద్ సీపీ బదులిస్తూ.. అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లో అనేక తప్పులు ఉన్నాయి.
కేసుకు సంబంధించిన వివరాలను వివరి స్తూ.. అందులో 2029 ఏప్రిల్ 14న కొండాపూర్‌లోని కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్‌కు వెళ్లి సర్వర్లు, హార్డ్‌డిస్క్‌లను ఇద్దరు మీడియేటర్ల సమక్షంలో సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఇలా హైదరాబాద్ పోలీసులు నాలుగేండ్ల ముందుకు వెళ్లి దర్యాప్తు జరిపినట్టు అందులో పేర్కొనడంపై ఇది క్లరికల్ తప్పిదమా? గుడ్డిగా అఫిడవిట్ తయారుచేశారా? అనేది సందేహంగా మారింది. ఇప్పటికే నాంపల్లి కోర్టులో 243/2024 క్రైమ్ నెంబర్ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను ఫైల్ చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఈ చార్జ్జిషీట్ తప్పుల తడకగా ఉండటంతో దానిని కోర్టు తిప్పి పంపింది. ఇప్పటికే మూడుసార్లు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.