BRS | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ), సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట: ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సౌకర్యాలపై బీఆర్ఎస్ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ సోమవారం గాంధీ దవాఖాన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో గాంధీ దవాఖాన వద్ద భారీగా పోలీసులు మోహరించారు.గాంధీలో మర ణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ సోమవారం గాంధీ దవాఖానను పరిశీలించాలని నిర్ణయించింది.ఇందులో భాగం గా మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్యే క్వార్ట ర్స్ నుంచి గాంధీ దవాఖానకు బయలుదేరగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కూడా ఇంటి నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.చాకచక్యంగా తప్పించుకున్న సంజయ్, ఆనంద్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి గాంధీకి బయలుదేరారు. పోలీసులు వీళ్లు వెళ్లే మార్గాన్ని నిర్బంధించారు. ఎలాగో అలా గాంధీకి చేరుకున్న ఈ ముగ్గురూ లోపలికి వెళ్దామనుకుంటే పోలీసులు అడ్డుకున్నా రు. తాము డాక్టర్లమని సంజయ్, మెతుకు ఆనంద్ చెప్పినా పట్టించుకోలేదు.
ఇదే సమయంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపా ల్ గాంధీకి బయలుదేరగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కూడా గాంధీకి రాకుండా పోలీసులను మోహరించారు. తాటికొండ రాజయ్య తన అనుచరులతో ఇంటి బయటకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకొని నగరమంతా తిప్పారు. తర్వాత బొల్లారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తీసుకువచ్చి తెలంగాణభవన్ వద్ద వదిలిపెట్టారు. ఇదే సమయంలో గాంధీ దవాఖాన వద్ద సంజయ్, మెతుకు ఆనంద్, మాగంటి గోపీనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో తిప్పి చివరకు తెలంగాణ భవన్ వద్ద వదిలిపెట్టారు.జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా హైదరాబాద్‌లో పోలీసులు హౌస్అరెస్టు చేశారు.
గాంధీకి వెళ్లడం నేరమా?
కేసీఆర్ హయాంలో వైద్యంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పుడు మాతా శిశుమరణాలు, విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. మందుల కొరత తీవ్రంగా ఉన్నది. గాంధీ ఆస్పత్రికి తాము వెళితే నేరమా..? ఇది ప్రజా పాలనా..? ఎమర్జెన్సీ పాలనా?
– మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
ప్రభుత్వమే మంచం పట్టింది
గాంధీ దవాఖానలో శిశు మరణాలు ఎందుకు పెరిగాయో తెలుసుకోవడానికి వెళ్లాం. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అయినా సీఎం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమే మంచం పట్టింది అన్నట్టు ఉన్నది పరిస్థితి.
– ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అంత నిర్బంధం ఎందుకు
కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ తెచ్చారు. కేసీఆర్ హయాంలో మాతా శిశుమరణాలు దాదాపుగా లేవు. రేవంత్ సరారులో ఎందుకు పెరిగాయి. మా పర్యటనపై నిర్బంధం ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పోకడలను అనుసరిస్తున్నది
– మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
దవాఖానలకు కమిటీ వెళ్తే భయమెందుకు: కేటీఆర్
ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను ఎందుకు అరెస్టు చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలియకూడదని ప్రభుత్వం భావిస్తున్నదా? బీఆర్ఎస్ పార్టీ అంటే భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రంలో వైద్యం పడకేసిందన్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రజలకు మేలుచేయాలనే కమిటీ వేశామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి భేషజాలకు పోవద్దని సూచించారు.
వాస్తవాలు తెలుస్తాయనే వణుకు: హరీశ్
‘దవాఖానల పనితీరు అత్యంత అధ్వాన్నంగా ఉన్నదన్న విషయం బయటపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వణికిపోతుంది. దవాఖానల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య నాయకత్వంలో డాక్టర్లు మెతుకు ఆనంద్, కల్వకుంట్ల సంజయ్‌తో కూడిన కమిటీ సోమవారం గాంధీ దవాఖాన వెళ్లాలనుకుంటే అరెస్టు చేయడం దుర్మార్గం’ అని ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
వాస్తవాలను తెలుసుకోవడానికే..
వాస్తవాలను తెలుసుకోవడానికి గాంధీకి వెళితే ఎలా అడ్డుకుంటారు ? పదేండ్ల కాలంలో ఇలాంటి ఘటనలు జరుగలేదు.
– ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్