హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 3.24 సెం.మీ, ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణంలో 2.85 సెం.మీ, రాజన్న -సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లెలో 2.85 సెం. మీ, మంచిర్యాల జిల్లా తాండూరులో 2.81 సెం.మీ, సూర్యాపేట జిల్లా మల్లెచెర్వులో 2.70 సెం.మీ, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో 2.44 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.