హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని.. ఈ నెల 13 లేదా 14న ఉదయం తీరాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజులు తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో రెండ్రోజులుగా భానుడి భగ భగలు మొదలయ్యాయి. ఆది, సోమవారాల్లో రాష్ట్ర ంలో ఎండల తీవ్రత ఎకువైంది. బుధవారం ములుగు, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.