TS Weather Update | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ, ఆగస్టు 2న కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వానలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో 22.7 మి. మీ, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 21.4 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 17.1 మి.మీ, ఖమ్మం జిల్లా వేం సూరులో 14.3 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 13.4 మి.మీ, వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో 12.6 మి.మీ, జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌లో 11.4 మి.మీ, వరంగల్ జిల్లాలోని నెక్కొండలో 11.2 మి.మీ, రాయపర్తిలో 9.6 మి.మీ, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో 9.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
న్యూఢిల్లీ, జూలై 29: దేశవ్యాప్తంగా భారీ వర్షాలను కురిపించి.. వరదలను సృష్టించిన రుతు పవనాలు ఆగస్టులో బలహీనపడే అవకాశాలు ఉన్నట్టు స్కైమే ట్ వెదర్ వెల్లడించింది. ఆగస్టు 4 నుంచి రుతు పవనాల బలహీన దశ ప్రారం భమయ్యే అవకాశం ఉన్నదని సంస్థ తెలిపింది. దీంతో ఎల్‌నినో దశ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నట్టు పేర్కొంది. గడిచిన 4 వారాలుగా పసిఫిక్ మహా సముద్రం ఉపరితలంపై వాతావరణం వేడెక్కుతున్నట్టు తెలిపింది. భూ మధ్య రేఖ చుట్టున్న సముద్ర జలాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు పేర్కొంది. జూలైలో ఎల్‌నినో చాలా బలహీనంగా ఉన్నదని, ప్రస్తుతం మధ్యస్థంగా ఉన్నప్పటికీ క్రమంగా అది బలపడుతున్నదని ఆ సంస్థ తెలిపింది.