హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇది ఏపీ, ఒడిశా, తెలంగాణ రాష్ర్టాల వైపు కదులుతున్నదని పేర్కొన్నది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో ఈనెల 10నుంచి 15 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. ఈనెల 14వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. గడిచిన 24గంటల్లో వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. వరంగల్ జిల్లా వరంగల్లో అత్యధికంగా 5.92 సెం.మీ, వరంగల్ ఖిల్లాలో 5.57 సెం.మీ, గీసుకొండలో 4.50 సెం.మీ, హనుమకొండ జిల్లా దామెరలో 4.16 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.