Rain Alert | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 22 వరకు మోస్తరు వర్షాలు కురువనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భదాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉండగా ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
వారం రోజులుగా తెలంగాణతోపాటు ఏపీలోనూ ఎండలు, ఉక్కపోత పెరిగాయి. సాధారణంకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు (36 డిగ్రీలకు పైగానే) నమోదవుతున్నాయి. మరి కొద్ది రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం బలహీనపడుతుండటంతో ఎండలు పెరుగుతున్నట్టు అంచనా వేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాక నుంచి ఇప్పటి వరకు 13 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో అత్యధికంగా 10.59 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 16: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రం సమీపంలోని మధురానగర్ వద్ద కరీంనగర్-జగిత్యాల రహదారిపై చెట్టు విరిగిపడటంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ వెళ్లే దారిలో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో దాటలేని పరిస్థితి నెలకొన్నది. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పాత బస్టాండ్, రాందాస్ చౌరస్తా రోడ్లలో సుమారు అరగంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన దరి రమేశ్ (30) అనే కూలీ పిడుగు పడటంతో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. గంటసేపు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతంలోని పలు ఇండ్లు, దుకాణాల్లోకి వరద చేరింది. పట్టణంలోని పైభాగం నుంచి వచ్చిన వరద నాగర్‌కర్నూల్-జడ్చర్ల ప్రధాన రహదారిని ముంచెత్తింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోయింది.