హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో నిష్క్రమిస్తాయని, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు ఇప్పటికే దక్షిణాది రాష్ర్టాల్లోకి ప్రవేశించాయని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నది. ముఖ్యంగా హైదరాబాద్లో రెండు రోజులపాటు దట్టంగా మబ్బులు కమ్ముకొని ఉంటాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో అత్యధికంగా 3.59 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.