హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున ఓ కేటుగాడు తన మాటల గారడీతో ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్‌ల యజమానులను బురిడీ కొట్టించి ఏకంగా రూ.20.59 కోట్ల విలువైన 13.6 కిలోల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘరానా మోసంపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. సోమాజిగూడలో కేవీ జ్యువెల్లర్స్, నితిన్ జ్యువెల్లర్స్ పేరిట ఆయన వ్యాపారాలు నడిపే నితిన్ గులాబానీ అనే వ్యక్తి నగల వ్యాపారంలో తన రేంజ్ వేరని, దేశంలోనే టాప్‌మోస్ట్ జ్యువెల్లరీ బ్రాండ్లుగా పరిగణించే మలబార్ గోల్డ్, కల్యాణ్ జ్యువెల్లర్స్ లాంటి కార్పొరేట్ సంస్థలతో తనకు అగ్రిమెంట్లు ఉన్నాయని, తన ద్వారా ఆ సంస్థలకు నిరంతరం వందల కిలోల బంగారం సరఫరా అవుతుందని నమ్మబలుకుతూ హైదరాబాద్‌లోని హోల్‌సేల్ ఆభరణ తయారీదారులు, వ్యాపారుల వద్దకు చేరాడు.
దీంతో నవ్య జ్యువెల్లర్స్, సిద్ధివినాయక, బన్సీలాల్, శ్యాంబాబా జ్యువెల్లర్స్ యజమానులు నితిన్ గులాబానీ మాయలోపడి కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అతనికి అప్పగించారు. జ్యువెల్లరీ వ్యవస్థలో ఉండే పాత సంప్రదాయం ప్రకారం డిస్ప్లే, రిటైల్సేల్స్ కోసం నమ్మకంతో అప్పగించిన ఆభరణాలను అమ్మగా వచ్చిన డబ్బును లేదా ఆ ఆభరణాలకు సమానమైన బంగారాన్ని తిరిగి ఇవ్వాలి. మొదట్లో కొన్ని ఆర్డర్లకు సక్రమంగానే డబ్బులు లేదా బంగారం ఇచ్చి వ్యాపారుల విశ్వాసాన్ని చూరగొన్న నితిన్.. నిరుడు ఏప్రిల్ 2025 నుంచి ఈ నెల మొదటి వారం వరకు ఆ నలుగురు జ్యువెల్లర్స్ నుంచి విడతల వారీగా 13.6 కిలోల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు.
గడువు ముగిసినప్పటికీ వారికి నగలు తిరిగి ఇవ్వలేదు. వారికి అందుబాటులోకి రావడం లేదు. బాధితులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో నితిన్ తన ఫోన్లు స్విచాఫ్ చేసి, బోర్డు కూడా తిప్పేసి మాయమైనట్టు తేలింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఆ నలుగురు జ్యువెల్లర్స్ హైదరాబాద్ సీసీఎస్‌ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నితిన్‌తోపాటు అతనికి సహకరించిన మరో ఐదుగురిపై చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసులు నమోదు చేశారు. కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను నితిన్ ఎక్కడికి తరలించాడు? దీనివెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది.