Budwel Lands | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలు గ్రామంలోని 4.19 ఎకరాల భూమి వేలానికి హైకోర్టు బ్రేక్ వేసింది. సర్వే నంబర్ 288/4లోని ఆ భూమిపై యాజమాన్య హక్కుల కోసం ఇద్దరు వ్యక్తులు చేసుకున్న దరఖాస్తులపై హెచ్ఎండీఏ అధికారులు తుది నిర్ణయం తీసుకునే వరకు వేలం వేయరాదని షరతు విధించింది.
ఆ ఇద్దరి దరఖాస్తులపై డిసెంబర్ 12లోగా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ తర్వాతే ఆ భూమి వేలంపై తుది నిర్ణయం తీసుకోవాలని హెచ్ఎండీఏకి స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 2కు వాయిదా వేసింది.