హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా చారిత్రక, వారసత్వ కట్టడాలుగా పరిగణించే చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో ఏ విధమైన పనులూ చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ రెండు కట్టడాలకు సమీపంలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టొద్దని గురువారం ఆదేశించింది. ఆ రెండు ప్రాంతాల్లో మెట్రో పనులకు సంబంధించిన సమగ్ర వివరాలు అందజేయాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం ఎలాంటి అధ్యయనం చేయకుండానే చార్మినార్, ఫలక్‌నుమాల వద్ద హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎస్) ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మెట్రో రెండో దశ పనుల కారణంగా వారసత్వ కట్టడాలు రెండింటికీ రక్షణ కొరవడుతుందని, ఇతర వారసత్వ కట్టడాలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు.
ప్రతిపాదిత మెట్రో రైలు మార్గంలో పురానీహవేలి, ఆఘాఖాన్ ఏ బెహ్రా, దారుల్షిఫా మస్జిద్, మొఘల్‌పురా టూంబ్ వంటి వారసత్వ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. మెట్రో మార్గం వల్ల ఈ వారసత్వ కట్టడాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం అధ్యయనం చేయించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. దీనిపై హెరిటేజ్ పరిరక్షణ, పట్టణ ప్రణాళిక, పర్యావరణం, కమ్యూనిటీ నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీతో అధ్యయనం చేయించాలని కోరారు.
అప్పటివరకు చారిత్రక కట్టడాల సమీపంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల నిలిపివేతకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, కౌంటర్ దాఖలు చేసేందుకు మూడు వారాల సమయం కావాలని కోరారు. ఇందుకు అనుమతిచ్చిన ధర్మాసనం, తదుపరి ఉత్తర్వులను జారీచేసే వరకు మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టరాదని పేర్కొంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.