హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): అమెరికా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో సాగిస్తున్న అక్రమ కాల్‌సెంటర్ నెట్వర్లపై ఈడీ ఉకుపాదం మోపింది. సైబరాబాద్ కమిషనరేట్, ఢిల్లీలో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన అధికారులు ఈ నెల 4న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సోదాలు నిర్వహించారు. ప్రధాన నిందితులైన మహ్మద్ అన్సారీ, అకిబ్ గులామ్రాసూల్ ఘంచి, కే వికాస్ నిమార్, దివ్యాంగ్ రావల్, వీ ప్రదీప్ రాథోడ్‌తోపాటు వారి అనుచరులు నిర్వహిస్తున్న కాల్‌సెంటర్ల నుంచి 12,000 అమెరికన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని గుర్తించి అధికారిక క్రిప్టో వాలెట్‌కు బదిలీ చేశారు. లెకల్లో చూపని రూ.13.5 లక్షలు సీజ్ చేశారు. నిందితుల నివాసాలు, కార్యాలయాల నుంచి కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుల వెనుక ఉన్న ఇతర సూత్రధారులు, హవాలా మార్గాల్లో తరలిన నగదు కోసం విచారణను వేగవంతం చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.