Telangana Voters | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సీ సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నిరుడు అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల నుంచి అందిన క్లెయిమ్స్ ఆధారంగా సోమవారం తుది జాబితాను ఆయన ప్రకటించారు. దాని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉండటం గమనార్హం. గత సంవత్సరంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య 4,90,318 పెరిగింది. కొత్తగా 5,45,046 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా 2,26,246 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,19,610 మంది ఓటర్లు తమ నియోజకవర్గాలను మార్చుకున్నారు. వివిధ కారణాల వల్ల 1,17,932 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల ముఖ్య అధికారి తెలిపారు.
కాగా, రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లిలో, అత్యత్ప ఓటర్లు భద్రాచలం నియోజకవర్గంలో ఉండటం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 2,829 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉండగా.. అత్యధికంగా వరంగల్ తూర్పు (341 మంది) నియోజకవర్గంలో ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఒక్క ట్రాన్స్‌జెండర్ ఓటరు నమోదు కాలేదు. భువనగిరి, దేవరకద్ర, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఒక్కరు చొప్పున ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉండగా.. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉండటం విశేషం. ఇక జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 46,24,192 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా ములుగులో 2,35,486 మంది ఓటర్లు నమోదయ్యారు. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లే అధికంగా ఉండటం మరో విశేషం.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 4 జిల్లాల్లో మిన హా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కానీ, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితాను అనుసరించి అత్యధిక ఓటర్లు ఉన్న టాప్ 5 నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య ఆధారంగా అత్యధికంగా ఉన్న టాప్ 5 నియోజకవర్గాలివే…
శేరిలింగంపల్లి 7,65,982
కుత్బుల్లాపూర్ 7,34,155
మేడ్చల్ 6,72,534
రాజేంద్రనగర్ 6,19,158
ఎల్బీనగర్ 6,06,190