హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వివిధ సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన రూ.26.2 కోట్లను బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ల ద్వారా 5,245 మంది సైబర్ బాధితులకు రూ. 26.2 కోట్ల నగదును రీఫండ్ చేసినట్టు తెలిపారు.
ఈ ఏడాది జూన్ 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యలో జరిగిన సైబర్ మోసాల్లో.. తక్షణం స్పందించి ఫ్రీజ్ చేసి న అమౌంట్‌ను బాధితులకు అందించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరుదైన ఘనతను సాధించిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో 4,800 మంది బాధితులకు 21.6 కోట్లు రీఫండ్ చేసినట్టు గుర్తుచేశారు.
ఈ సందర్భంగా సీఎస్బీ అధికారులు, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లు, డీఎల్ఎస్ఏలు, సీపీలు, ఎస్పీల సమన్వయంతో ఓ బెంచ్‌మార్క్‌ను సెట్ చేశామని చెప్పారు. అపరిచితులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని, ఒకవేళ మోసానికి గురయ్యామని తెలిసిన గంట(గోల్డెన్ అవర్)లో 1930కి కాల్ చేయాలని సూచించారు.