హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో అమలు చేసిన విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పుడు హైదరాబాద్‌ను వాయుకాలుష్య ప్రమాదం నుంచి సంరక్షిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్య స్థాయిలో హైదరాబాద్ 26.4 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఈ విషయాన్ని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ) గణాంకాలు వెల్లడించాయి. నగరం సురక్షితంగా ఉండటం వెనుక.. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏడేండ్ల కృషి ఉందని పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హరితహారంలో భాగంగా నగరంలో కోట్లాది మొక్కలు నాటడం, వేలాదిగా అర్బన్ లంగ్ స్పేస్‌లు, నర్సరీలు, పార్కులు అభివృద్ధి చేశారని గుర్తుచేస్తున్నారు. అలాగే వాహన కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అందించారని చెప్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు ట్యాక్స్ రద్దు చేసి, ప్రోత్సహించడం వంటి ఆదర్శవంతమైన పథకాలతో పర్యావరణ కాలుష్యాన్ని కట్టడి చేయడానికి దోహదపడినట్టు వివరిస్తున్నారు.
ప్రజల ప్రాణాలను నెమ్మదిగా మింగేసే ప్రమాదకర వాయుకాలుష్యం దేశంలోని ప్రధాన నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం జనాలను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నది. వాయుకాలుష్యం తగ్గుదలలో హైదరాబాద్ సేఫ్జోన్లో ఉందని ఎన్సీఏపీ వెల్లడించడంపై పర్యావరణ నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఏడేండ్లుగా వాయుకాలుష్య నియంత్రణలో ఢిల్లీ, చైన్నై కంటే హైదరాబాద్ ముందున్నది. జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను నిరంతరం ఉల్లంఘిస్తున్న నగరాల్లో పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని కట్టడి చేయడానికి 2019లో ఎన్సీఏపీ నమోదు ప్రక్రియ చేపట్టింది. 2025-26 నాటికి పీఎం10 స్థాయిలను 40 శాతం వరకు తగ్గించడం లేదా 60 మైక్రో గ్రాముల వరకు సురక్షిత పరిమితిని చేరుకోవడం లక్ష్యంగా క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇందుకు అనుగుణంగా ఎన్సీఏపీ ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హెచ్చరిస్తుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి పర్యావరణహితమైన కార్యక్రమాలను ప్రోత్సహించి, కొనసాగించాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కాలుష్య కట్టడిపై సరైన ప్రణాళికలు రూపొందించకపోతే భవిష్యత్తులో నగరవాసులు తీవ్ర ముప్పు ఎదుర్కోనున్నారని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ 2026 లక్ష్యాన్ని చేరుకోవడానికి సవాళ్లను ఎదుర్కొంటున్నదని చెప్తున్నారు. పీఎం10 స్థాయిలు జాతీయ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా నమోదు అవుతుండటంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం సరైన ప్రణాళికలు అమలు చేయాలని సూచిస్తున్నారు.
వాయుకాలుష్యం విషయంలో హైదరాబాద్ పరిస్థితి మెరుగుపడటం రాత్రికి రాత్రి జరిగిందేమీ కాదు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాదిగా లంగ్స్ స్పేస్‌లు, నర్సరీలు, పార్కుల అభివృద్ధి జరిగింది. వాయుకాలుష్యంలో హైదరాబాద్ 26.4 శాతం తగ్గుదల నమోదు చేయడంలో చాలా కృషి ఉంది. హరితహారం లాంటి విప్లవాత్మక పథకంతో కోట్లాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాం. ప్యారిస్, బొగొటో, మెక్కికో లాంటి అత్యున్నత నగరాలను అధిగమించి హైదరాబాద్ 2022లో వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డును దక్కించుకుంది. భారతదేశంలో అటవీ పచ్చదనం 24 శాతం నుంచి 33శాతానికి పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ దార్శనికత, కృషి ఫలితంగానే తెలంగాణలో పచ్చదనం పెరిగింది. పౌరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అతిపెద్ద నగరాలు రావాల్సిన అవసరం లేదు.