హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖ సంగారెడ్డి, హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్‌గా, ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కే ధర్మాను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయనను ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ జనరల్‌కు అటాచ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపునకు ప్రధాన కారణం అవినీతి ఆరోపణలేనని ఇరిగేషన్ శాఖలో జోరుగా చర్చ కొనసాగుతున్నది. హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్‌గా కొనసాగుతున్న కే ధర్మాకు ఏడాది క్రితమే సంగారెడ్డి సీఈ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు.
రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలో ఒక మాల్ నిర్మాణానికి ఎన్వోసీ మంజూరుచేసేందుకు దాదాపు రూ.కోటిన్నర డిమాండ్ చేసినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. సదరు బాధితుడు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, వెనువెంటనే ధర్మాను తప్పించినట్టు ఇరిగేషన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎకడా పోస్టింగ్ ఇవ్వకుండా ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్‌కు ప్రభుత్వం అటాచ్ చేసింది. ఇదిలా ఉంటే సీఈ ధర్మాపై ఆదినుంచీ అనేక ఆరోపణలున్నాయి. చెరువులు, నాలాల సమీపంలో భవనాల నిర్మాణాలకు ఎన్వోసీ తీసుకోవడం తప్పనిసరి. ఇదే అదనుగా భారీగా వసూళ్ల దందాకు తెర లేపినట్టు ఆరోపణలున్నాయి. ఇటీవలనే సంగారెడ్డి సరిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలువురు అధికారులను పట్టుకున్నారు.