CM KCR | హైదరాబాదాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అద్భుత కార్యక్రమాలు అమలుచేస్తున్నదని బీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, దళిత ఉద్యమ నేత చంద్రశేఖర్ ఆజాద్ కొనియాడారు. సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శమని శ్లాఘించారు. దళితుల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మకమైనదని పేర్కొన్నారు. నూతన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఇంత ప్రేమ చూపినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన ఆజాద్ గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం వారిద్దరూ కలిసి సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.
ఆ తర్వాత అమరజ్యోతి వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ.. నూతన పార్లమెంట్ భవనంలో అంబేదర్ విగ్రహం పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం రాకముందు అంబేదర్తో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఇప్పుడు కూడా వాళ్లకే ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడాన్ని స్వాగతించిన ఆయన, బీఆర్ఎస్ దేశంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తాను ఢిల్లీలో నిరసన తెలిపినప్పుడు బీఆర్ఎస్ ఎంపీల వచ్చి మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. మణిపూర్ ఘటన దేశంలో అత్యంత దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
బలహీన వర్గాల బంధువు కేసీఆర్: కవిత
నూతన పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరు పెట్టాలన్న ఆజాద్ డిమాండ్‌కు తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని దర్శించడంతోపాటు సీఎం కేసీఆర్‌ను కలుసుకోవడానికి ఆజాద్‌ను ఆహ్వానించామని, తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. దేశంలో అందరూ చరిత్రను మరిపించే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణలో చరిత్రను శాశ్వతంగా ఉంచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆజాద్ పేర్కొనటం సంతోషంగా ఉన్నదని తెలిపారు. వెనుకబడిన వర్గాల కోసం ఆజాద్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల అండ ఉంటుందని, అటువంటి పోరాటాల్లో తాము కలిసి వస్తామని స్పష్టం చేశారు.
ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని వివరించారు. ఆజాద్ వంటి భావసారూప్యత కలిగిన నేతలతో తాము కలిసి నడుస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్, ఉపేందర్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు అయాచితం శ్రీధర్, జూలూరు గౌరీశంకర్, మేడె రాజీవ్‌సాగర్, కే వాసుదేవరెడ్డి, వై సతీశ్‌రెడ్డి, సోమా భరత్‌కుమార్, దూదిమెట్ల బాలరాజు, కొణతం గోవర్ధన్, గజ్జెల నగేశ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయ గౌడ్, రామచంద్రునాయక్, వాల్యా నాయక్, పల్లె రవికుమార్, బండ శ్రీనివాస్, మఠం భిక్షపతి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.