హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానలో మరో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి పునర్జీవం ప్రసాదించారు నిమ్స్ వైద్యులు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబంలోని 12 ఏండ్ల బాలుడు పుట్టుకతోనే వెసెకో యూరేట్రిక్ రిఫ్లెక్ట్ (వీయూఆర్) అనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. గత ఏడాదికాలంగా డయాలసిస్‌పైనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇన్ఫెక్షన్ పెరగడంతో రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి.
కానీ, బయట ఏ కార్పొరేట్ దవాఖానకు వెళ్లిన రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం తమ కుమారుడిని దక్కించుకునేందుకు నిమ్స్‌ను ఆశ్రయించింది. నిమ్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ తన బృందంతో కలిసి బాలుడికి వైద్య పరీక్షలు చేశారు. ఈ అరుదైన కేసును చాలెంజ్‌గా తీసుకొన్న వైద్యులు బాలుడికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. కిడ్నీలను తొలగించడంతో పాటు అదేసమయంలో కిడ్నీ మార్పిడి చేయడం చాలా అరుదు అని డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ప్రస్తుతం బాలుడు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. దీంతో నిమ్స్ వైద్యబృందాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. నిరుపేదలకు మెరుగైన చికిత్స అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని చెప్పారు. కాగా, పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సకు సహకరించిన మంత్రి హరీశ్‌రావుకు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు బాలుడి తల్లిదండ్రులు ప్రత్యేక
కృతజ్ఞతలు తెలిపారు.