HYDRA | హైదరాబాద్/ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ‘సార్.. మా అపార్ట్మెంట్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా? బఫర్‌జోన్‌లోకి వస్తుందా? చూసి చెప్పండి..’ ఇవీ.. పలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సామాన్యులు అధికారులను అడుగుతున్న ప్రశ్నలు. కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలో హైడ్రా కొనసాగిస్తున్న కూల్చివేతలు.. చెరువుల సమీపంలోని అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ కొనుగోలు చేసినవారి గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. దీంతో వారు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి తమ అపార్ట్మెంట్ల పరిస్థితి ఏమిటని ఆరా తీస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వీటికి సంబంధించిన సందేహాలే ఎక్కువగా రావడం గమనార్హం. ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చి తాము నిర్మించిన అపార్టుమెంట్లపై ఆరా తీయ డం కనిపించింది. ఇదేవిధంగా జీహెచ్ఎంసీ,జలమండలి కార్యాలయాల వద్ద కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
హైదరాబాద్‌లోని అనేక చోట్ల బడా నిర్మాణ సంస్థలు కూడా చెరువుల సమీపంలో అపార్టుమెంట్లను నిర్మించి, విక్రయించాయి. లక్షలాది సామాన్యులు వాటి ల్లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌వాసుల్లో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పలు అపార్టుమెంట్లలో ఆదివారంరోజే సమావేశాలు నిర్వహించుకుని, జరుగుతున్న పరిణామాలపై చర్చించుకున్నారు. సోమవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించడంతో అక్కడికి వచ్చి తమ అపార్టుమెంటు కుంటలు, చెరువుల పరిధిలోకి వస్తుందా? కంటోన్మెంట్ బోర్డు హైడ్రా పరిధిలోకి వస్తుందా? అని ఆరా తీశారు. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున వర్తించదని అక్కడివారు స మాధానం ఇచ్చారు. హస్మత్‌పేట చెరువు సమీపంలోని అపార్టుమెంట్ల వాసులు చాలామంది ఉదయం నుంచి ఇదేరీతిన అడుగుతున్నారని అధికారులు చెప్తున్నారు.
శివారు ప్రాంతాల్లోనూ అలజడి
హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనూ అలజడి మొదలైంది. ఎప్పుడు ఎవరి భవనం కూలుతుందోనన్న భయం పలువురిని వెన్నాడుతున్నది. పారిశ్రామికవాడలన్నీ ఎక్కువగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అనేక పారిశ్రామికవాడల్లో చిన్నాచితక చెరువులు, కుంటలు ఉన్నాయి. ముఖ్యంగా చర్లపల్లి, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో పారిశ్రామికవాడల సమీపంలోనే చెరువులు ఉండగా, ఉప్పల్ పారిశ్రామికవాడ మూసీ నది సమీపంలోనే ఉన్నది. వాటి బఫర్జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించిన తరువాతే లేఔట్ లు చేసి పరిశ్రమలకు కేటాయించారు. ఎంతోకాలంగా ఇక్కడ పరిశ్రమలు కూడా కొనసాగుతున్నాయి. అయితే, హైడ్రా ఎప్పుడు, ఎవరిపై కూల్చివేతల అస్ర్తాన్ని ప్రయోగిస్తుందో అంతుబట్టడంలేదని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో ప్రభుత్వమే స్థలా లు కేటాయించినప్పటికీ, పరిశ్రమ వర్గాల్లో ఒక విధమైన భయానక వాతావరణం ఉన్నదని, కొత్తగా పరిశ్రమ పెట్టేవారు ఏ చిన్న కుంట ఉన్నా ఆ దరిదాపుల్లోకి వచ్చేందుకు కూడా జంకుతున్నారని చెప్తున్నారు.
రియల్ అగమ్యగోచరం
మరోవైపు రియల్ఎస్టేట్ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు నేపథ్యంలో మందకొడిగా ఉన్న రియల్ ఎస్టేట్‌రంగం పరిస్థితి హైడ్రా కూల్చివేతలతో నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. కొత్తగా లేఔట్లు వేసేవా రు, నిర్మాణాలు చేపట్టేవారు కొంతకాలం వేచిచూద్దామనే ధోరణి అవలంభిస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన టైటిల్ క్లియర్‌గా ఉన్నప్పటికీ, ప్రాజెక్టు చేపట్టేందుకు ధైర్యం సరిపోవడం లేదని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. అన్నీ సవ్యంగా ఉన్నా ఒకటికి పదిసార్లు చూసుకుని, అధికారుల నుంచి అభయం లభించేవరకు ప్రాజెక్టు చేపట్టలేమని అంటున్నారు.