హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలిచి మూడు రోజులు కూడా గడవక ముందే.. ఆయన తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ (Chinna Srisailam Yadav) రౌడీయిజం షురూ చేశారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని (Padi Kaushik Reddy) ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో తీవ్ర దుర్భాషలాడారు. మీడియా ముఖంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ‘నేను తలుచుకుంటే పాడి కౌశిక్‌రెడ్డిని కొట్టిస్తా.. తోలు తీస్తా.. లైఫ్ ఇచ్చింది, రంజీట్రోఫీలో ఆడించిందే మేము.. నేను ఒక్క ఆర్డర్ ఇస్తే వాడి ఎంబడి ఉండెటోళ్లే వాన్ని కొడ్తరు.. మా గురించి ఏమనుకుంటున్నరు?’ అంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు.
చిన్న శ్రీశైలంయాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలతో జూబ్లీహిల్స్ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఓ ప్రజాప్రతినిధిని ఇష్టారీతిన దూషించారని, ఆ స్థాయి వాళ్లనే అలా అంటుంటే ఇక సామాన్యులను నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలిచిన నాటి నుంచే రౌడీయిజానికి తెరలేపారు. ఫలితాలు వెలువడిన రోజు రాత్రి రాకేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను దారికాచి వెంబడించి నవీన్ యాదవ్ అనుచరులు దాడి చేశారు. ఇస్టారీతిన దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. ఆ ఘటనను మరవక ముందే నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కొడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
పాడికౌశిక్ రెడ్డిని కొడతామని.. ఆయన మనుషులతోనే కొట్టిస్తామని బహిరంగంగానే బెదిరించారు. నవీన్ యాదవ్ గెలిచిన వెంటనే ఆయన తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ రౌడీయిజానికి తెర తీశారని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మూడేండ్లపాటు తమ పరిస్థితి ఏమిటి? అంటూ భయబ్రాంతులకు గురవుతున్నారు. కాంగ్రెస్, చిన్న శ్రీశైలంయాదవ్ అరాచకాలకు అడ్డూ అదుపు ఉండదని ఆందోళన చెందుతున్నారు.