హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్7: ‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులోని డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో 16 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతున్న నిరాహార దీక్షలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం అన్యాయమని మండిపడ్డారు.
ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తానని, డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టనివ్వనని తేల్చిచెప్పారు. డంపింగ్‌యార్డ్‌ను రద్దు చేయకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఇదే పోరాట స్ఫూర్తి తో ముందుకెళితే డంపింగ్ యార్డు రద్దవుతుందని చెప్పారు. యార్డు కోసం సరార్ నయాపైసా పెడ్తలేదని, బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పుతున్నదని ఆరోపించారు.