ప్రయాగ్‌రాజ్: వివిధ కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గింపు, అడ్మిషన్ ఫీజు పెంపును నిరసిస్తూ యూపీ ప్రయాగ్‌రాజ్ లోని అలహాబాద్ యూనివర్సిటీలో ఒక వర్గం విద్యార్థులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు జూలై 10 నుంచి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. సెనేట్ గేట్గా పిలిచే ప్రధాన ద్వారం వద్ద దిశ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గ్రూప్‌లకు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో యూనివర్సిటీ యంత్రాంగం, నిరసన తెలుపుతున్న విద్యార్థుల మధ్య గురువారం చర్చలు జరిగాయి. చర్చలు శాంతియుతంగా జరిగాయని, విద్యార్థులు ఆందోళన విరమించారని యూనివర్సిటీ పాలకవర్గం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించగా, చర్చలు అసంపూర్తిగా సాగాయని, ఆందోళన విరమణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా తిరిగి ఆందోళనను కొనసాగించడంతో యూనివర్సిటీ అంతకుముందు పెట్టిన పోస్ట్‌ను శుక్రవారం తొలగించింది.