Sangareddy | అత్తింటివారు బైక్ కొనివ్వడం లేదనే కోపంలో ఓ వ్యక్తి తన భార్యను ఆవేశంలో చంపేశాడు. అనంతరం పోలీసులు పట్టుకుంటారేమో అని భయంతో అతను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మారేపల్లికి చెందిన దాసరి అంజయ్య (25)కి 11 నెలల కిందట నారాయణఖేడ్ మండలం సంజీవ్రావుపేటకు చెందిన యాదమ్మ(20)తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మారేపల్లి శివారులో ఓ మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. అక్కడే నివాసం ఉంటూ మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. అయితే మద్యానికి బానిసైన అంజయ్య.. అత్తింటి వారు బైక్ కొనివ్వాలని తరచూ భార్యతో గొడవపడేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అంజయ్య తల్లి మామిడి పండ్లు విక్రయించేందుకు సదాశివపేటకు వెళ్లగా.. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అంజయ్య.. ఆవేశంలో యాదమ్మను గదిలో చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుని, జైల్లో వేస్తారని భయాందోళన చెంది.. ఘటనాస్థలికి కొద్దిదూరంలో మామిడిచెట్టుకు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. యాదమ్మ తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.