నిజామాబాద్, అక్టోబర్ 24 : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్యను గొంతు నులిమి హతమార్చాడు. ఎస్సై రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన నత్తి రోజా (35)ను ఆమె భర్త నత్తి సాగర్ హత్య చేశాడని తెలిపారు. రోజా, సాగర్‌కు 13 ఏండ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెళ్లయిన నాటి నుంచే భర్త సాగర్, అత్త పెద్దమ్మి నిత్యం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసేవారు. ఇదే క్రమంలో రోజాను ఎలాగైనా హతమార్చాలని పథకం వేశారు. ఆదివారం అర్ధరాత్రి రోజా నిద్రిస్తున్న సమయంలో సాగర్.. రోజాను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ మేరకు రోజా కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.