హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ‘తరుగు’ పేరిట వందల కోట్ల దోపిడీ జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లలో తరుగు పేరుతో చేసిన దోపిడీ రూ.వెయ్యి కోట్లకుపైగానే ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి రైతు ధాన్యంలో క్వింటాల్‌కు 7 కేజీల నుంచి 10 కేజీల వరకు కోత పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది 20 కేజీల వరకు ఉన్నదని చెప్తున్నారు. తాలు, తేమ సాకుతో తూకంలో కోత పెట్టకుండా ఒక్కరంటే ఒక్క రైతు కూడా ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నది. కొనుగోలు కేంద్రంలో పెట్టిన కోత సరిపోదని, మిల్లుల్లోనూ అదనంగా కోత పెడుతున్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు నిబంధనల ప్రకారం ఒక బస్తాలో 40 కేజీలు తూకం వేయాలి. కానీ కొనుగోలు కేంద్రాల్లో తాలు, తేమ ఉన్నదంటూ, సంచి బరువు పేరుతో 43-45 కేజీలు తూకం వేస్తున్నారు. ఇక కాంటా పెట్టిన ధాన్యం మిల్లుకు వెళ్లిన తర్వాత అక్కడ ధాన్యం తనిఖీ చేస్తారు.
ఆ ధాన్యం బాగాలేదని, తాలు, తేమ ఉన్నదని, ఆ ధాన్యాన్ని తాము దించుకోబోమని, వెనక్కి తీసుకెళ్లాలంటూ మిల్లుల యాజమాన్యాలు రైతులను బెదరగొడుతాయి. లేదంటే తరుగు పేరుతో కోత పెడుతామని, అందుకు ఒప్పుకొంటే దించుకుంటామని మెలికపెడుతున్నాయి. అప్పటికే నెల రోజులపాటు అష్టకష్టాలు పడి కాంటా పెట్టుకొని తెచ్చిన తర్వాత మళ్లీ వాపస్ పంపితే భరించే ఓపిక రైతుల్లో లేకుండా పోయింది. దీంతో రైతులు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. చేసేదేంలేక, చెప్పుకొనే దిక్కులేక మిల్లర్ల కండీషన్లకు ఒప్పుకొంటున్నారు. ఇలా రైతుల మెడ మీద కత్తి పెట్టి మిల్లుల్లో క్వింటాల్‌కు 5-10 కేజీలు కోత పెడుతున్నారు. కొన్ని మిల్లుల్లో అయితే మరి అరాచకంగా 20 కిలోల వరకు కోత పెడుతున్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ రైతు తిరుపతయ్య ధాన్యంలో క్వింటాల్‌కు 19 కేజీల కోత పెట్టడం తీవ్ర దుమారం రేపింది.
నోరెత్తని సర్కార్.. వాటాల కోసమేనా?
ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, మిల్లర్లు తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తుంటే సర్కార్ నోరెత్తడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీపై మిల్లర్లను కట్టడి చేసేందుకు కనీస ప్రయత్నాలు కూడా చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సర్కార్ మౌనం, మరోవైపు అధికారుల లాలూచీ వెరసి మిల్లర్లు యథేచ్ఛగా రైతులపై దోపిడీకి తెగబడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇత జరుగుతున్నా సర్కార్ మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లతో సర్కార్ కుమ్మక్కైందనే తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరుగు పేరిట చేస్తున్న దోపిడీ సొమ్ముల్లో వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
42 లక్షల క్వింటాళ్లు.. వెయ్యి కోట్ల దోపిడీ?
ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు క్వింటాలు ధాన్యానికి కనీసంగా సగటున 7 కేజీలు కోత పెడుతున్నారు. ఈ లెక్కన తరుగు పేరిట జరుగుతున్న దోపిడీ లక్షల క్వింటాళ్లకు, వేల కోట్ల రూపాయలుగా ఉంటున్నది. ఈ సీజన్లో ప్రభుత్వం ఇప్పటివరకు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. సగటున క్వింటాల్‌కు 7 కేజీల కోత లెక్కిస్తే, తరుగు పేరిట పక్కకు తీసిన ధాన్యం ఏకంగా 42 లక్షల క్వింటాళు ్ల(4.2 లక్షల టన్నులు) వరకు ఉంటుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,389గా ఉన్నది. అంటే తరుగు పేరిట తీసిన 42 లక్షల క్వింటాళ్ల విలువ రూ.1,000 కోట్లు కావడం గమనార్హం. చిన్న చిన్నగా తీసిన తరుగు అంతా కలిపి లెక్కిస్తే దిమ్మతిరిగే విలువ రావడం గమనార్హం. ఇలా తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని కొల్లగొట్టి రూ.వెయ్యి కోట్ల దోపిడీకి తెగబడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.