Telangana | దయ్యాలే వేదాలు వల్లిస్తే.. అది కాంగ్రెస్!హంతకుడే సంతాపం తెలిపితే.. అది కాంగ్రెస్ కాలరాసినవాడే కాలరెగరేస్తే.. అది కాంగ్రెస్!
ఆరు దశాబ్దాల తమ ఏలుబడిలో తెలంగాణను అంధకారంలోకి నెట్టేసిన పార్టీ.. పదేండ్లలో రాష్ట్రం ధ్వంసమైపోయిందంటూ చేసిన గాయిగత్తర ప్రచారమూ అలాంటిదే. అబద్ధాలను పదే పదే వల్లెవేస్తే.. జరిగిన అభివృద్ధి అదృశ్యమవుతుందా? వాస్తవాలను దాచేస్తే.. అక్షరసత్యాలు అంతర్ధానమవుతాయా? కాంగ్రెస్ అంటేనే నోటికి మూతలు! కండ్లకు గంతలు!
“కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయి!.. అభివృద్ధి కుంటుపడింది!.. ఆర్థిక విధ్వంసం జరిగింది!.. పదేండ్లలో తెలంగాణ వందేండ్లు వెనక్కి వెళ్లింది!.. ఏ వర్గానికీ సంక్షేమ ఫలాలు అందలేదు!.. అప్పు తెచ్చి చేసిన ప్రగతి ఆనవాళ్లు కూడా లేవు!”..
ఇదీ కాంగ్రెస్ సాగించిన దుష్ప్రచారం. 70 ఏండ్ల ఉమ్మడి పాలన స్వర్ణయుగమైనట్టు.. ధర్మప్రభువుల్లాంటి సమైక్య పాలకుల దయార్ద్ర హృదయాలతో ఈ ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందినట్టు.. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రగతినేదో కేసీఆర్ పదేండ్లలో సర్వనాశనం చేసినట్టు.. అప్పటిదాకా ఆకాశమంత ఎత్తులో ఉన్న తెలంగాణ అభివృద్ధిని ఆయనేదో పాతాళానికి పడదోసినట్టు.. చిత్రీకరించారు. అదే నిజమన్నట్టు పదే పదే మాట్లాడారు. వందిమాగధులతో కలిసి వార్రూముల్లోంచి అబద్ధాలను ప్రచారంలో పెట్టారు. ఊరూరా ఊదరగొట్టారు.
అద్భుత వేగంతో పరిగెడుతున్న తెలంగాణ అభివృద్ధి కనపడకుండా అరచేతిని కంటికి అడ్డుపెట్టే ప్రయత్నం చేశారు. బలహీన మనస్కులైన కొందరు ఓటర్లు ఆ భ్రమల్లో మునిగారు. చంద్రుడిని వదిలేసి.. చెంబు సొట్టను చూశారు.
అధికార యావలో కాంగ్రెస్ నాయకులు సాగించిన తప్పుడు ప్రచారం.. అధికారిక సౌధాల్లో కూర్చున్నా ఆపలేదు. అప్పులను పెద్దదిగా చూపినట్టే.. అభివృద్ధిని చిన్నగా చూపించేందుకు ప్రయత్నించారు. కానీ, ఎన్నిరంగులద్దినా అబద్ధం అబద్ధమే. ఏ మెరుపుల్లేకపోయినా అభివృద్ధి అభివృద్ధే. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా. తెలంగాణ ఆర్థికంగా ఆకాశమెత్తు ఎదిగిన వైనాన్ని తన తాజా నివేదికలో వివరించింది. కాంగ్రెస్ ఇన్నాళ్లు సాగించిన దుష్ప్రచారాన్ని తుత్తునియలు చేసింది.
జీఎస్డీపీ అంటే స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి. అది అన్నిరంగాల అభివృద్ధి సారాంశం, సమాహారం. అది సమ్మిళిత, సమగ్ర ప్రగతికి సూచిక. జీఎస్డీపీలో అగ్రభాగాన ఉండటమంటే.. అప్రతిహత సర్వతోముఖాభివృద్ధి సాధించడమే. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ. 1,03,889 ఉండగా.. పదేండ్లలో మూడున్నర రెట్లు పెరిగి రూ.3,56,564కు చేరిందని తేల్చింది ఆర్బీఐ. 14వ స్థానంలో ఉన్న రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానానికి ఎగబాకింది. ఇదేనా కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం? 2014లో రూ. 4.3 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ రూ.15.01 లక్షల కోట్లకు పెరిగింది. పదేండ్లలో 249 శాతం పెరుగుదలను.. అభివృద్ధి కుంటుపడటం, ఆర్థికవృద్ధి సన్నగిల్లడం అంటారా? దేశ పౌరుల సగటు ఆదాయం కన్నా.. తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం లక్షన్నర ఎక్కువేనన్నది ఆర్బీఐ మాట. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది ఇలాగేనా? ఇన్నాళ్లూ తప్పుడు లెక్కలు చెప్పిన గాంధీభవన్ ఆర్థికవేత్తలు ఇప్పుడేమంటారు? తలాతోకా లేకుండా ఆరోపణలు చేసిన ఖద్దరు గోబెల్స్ ఇప్పుడేం చెప్తారు?
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/స్పెషల్ టాస్క్ బ్యూరో: ఒక రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అభివృద్ధికి తలసరి ఆదాయం, జీఎస్డీపీ, సొంత రాబడులే కొలమానాలు. ఈ మూడు అంశాల్లో కేసీఆర్ పదేండ్ల పాలన దేశానికే దిక్సూచిగా నిలిచింది. మందగమనంలో ఉన్న తెలంగాణ ఆర్థిక వృద్ధికి రాకెట్ పరుగులు నేర్పింది. సూచీల్లో అడుగున ఉన్న రాష్ట్రాన్ని సగర్వంగా అగ్రస్థానాన నిలిపింది. ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. తెలంగాన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల దార్శనికత, అకుంఠిత దీక్ష, పక్కా ప్రణాళికలతోనే ఇది సాక్షాత్కారం అయ్యింది. పదేండ్ల కాలంలోనే వందేండ్ల అభివృద్ధి సాధించింది. ఇదేదో గొప్పలకు పోతూ చెప్పుకుంటున్న మాటలు కాదు.. గణాంకాలు చెప్తున్న మాట. దేశ అత్యున్నత ఆర్థిక సంస్థగా పిలిచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా నివేదిక ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024’లో తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన ఆర్థికాభివృద్ధికి ఇచ్చిన ‘మెరిట్ సర్టిఫికెట్’. తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో తెలంగాణ సాధించిన ప్రగతిని కండ్లకు కట్టినట్టు చూపించింది. తొమ్మిదిన్నరేండ్లలోనే జీఎస్డీపీ, తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగిందని స్పస్టం చేసింది.
పిన్న రాష్ట్రం.. పెద్ద అభివృద్ధి
దేశంలో అతిపిన్న రాష్ట్రం తెలంగాణ. భౌగోళికంగా మనది 11వ స్థానం. జనాభా పరంగా చూస్తే 12వ స్థానం. దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.9 శాతం. కానీ, దేశ జీడీపీలో తెలంగాణ వాటా ఏకంగా 5 శాతం. ఇది విధ్వంసం కాదు.. ఆర్థిక అభివృద్ధికి నిదర్శనం. ఏ ఒక్కరోజులోనో ఇది సాధ్యం కాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తెలంగాణ ఆర్థిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏయే రంగాల్లో ఏ రకమైన సంస్కరణలు చేపడితే ఫలితాలు రాబట్టవచ్చో అధ్యయనం చేశారు. తెలంగాణను ఆర్థికంగా ఉన్నతస్థితికి తీసుకురావడానికి ప్రణాళికలను రచించారు. ఫలితంగా ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన రాష్ర్టాలు సైతం సాధించలేని ఆర్థిక రికార్డులను తెలంగాణ రాష్ట్రం కేవలం తొమ్మిదిన్నరేండ్లలోనే నమోదు చేసింది. వందేండ్ల చరిత్ర కలిగిన బీహార్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్, పెద్దరాష్ట్రంగా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్, సిలికాన్ సిటీ బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటకను సైతం తోసిరాజని తలసరి ఆదాయం వృద్ధిలో, జీఎస్డీపీ నమోదులో మిగతా పెద్ద రాష్ర్టాలకు కూడా తెలంగాణ ఆర్థిక పాఠాలు బోధిస్తున్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తొమ్మిదిన్నరేండ్లలోనే రాష్ట్ర తలసరి ఆదాయం 249% పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,49,534 ఎక్కువ. ఇక, జీఎస్డీపీలోనూ గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ రికార్డులు నమోదు చేసింది. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.9% మాత్రమే. అయితేనేం, దేశ జీడీపీ లో తెలంగాణ వాటా 5 శాతాన్ని దాటడం విశేషం.
రాకెట్ వేగంతో జీఎస్డీపీ వృద్ధి
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ జెట్ వేగంతో దూసుకెళ్లడంతో గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జీఎస్డీపీ స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2. 9 శాతం. కానీ, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.02 శాతంగా ఉండటం విశేషం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.4,30, 599 కోట్లు. 2023-24లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.15,01,981. అంటే తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్ర జీఎస్డీపీ రూ. 10,71,382 కోట్లు (249 శాతం) పెరిగింది. తొమ్మిదిన్నరేండ్లలో జీఎస్డీపీ మూడున్నర రెట్లు పెరిగింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత అతి తక్కువ సమయంలో ఇంత భారీగా జీఎస్డీపీ వృద్ధి జరగలేదు.
అగ్రస్థానమే లక్ష్యంగా..
తెలంగాణ ఉద్యమ నినాదం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. దీంట్లో ప్రధానమైన నిధులపై కేసీఆర్ తొలుత దృష్టి సారించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేనాటికి గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉండేది. దీంతో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్ఠం కావాలంటే ఉత్పాదకత పెరుగాలని, అది జరగాలంటే ఆర్థిక రంగంలో సంస్కరణలే మార్గమని కేసీఆర్ గ్రహించారు. ఈ క్రమంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్థిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమిటి? రాబడి ఎంత? ఖర్చులేంటి? వంటి కీలకాంశాలపై శ్రద్ధ పెట్టారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచి తద్వారా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉపాధి కల్పనతో ప్రజలకు చేతినిండా పని కల్పించి వారి ఆదాయాన్ని పెంచి తద్వారా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని (జీఎస్డీపీ) మెరుగుపర్చడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. ఆర్థిక రంగంపై కేసీఆర్ మార్క్ తొలి ఏడాది నుంచే కనిపించడంతో అతి తక్కువ సమయంలోనే తెలంగాణ సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. కరోనా సంక్షోభం సమయం మినహాయిస్తే, తలసరిలో ఏటా రెండంకెల వృద్ధిరేటును రాష్ట్రం నమోదు చేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి దేశ జీడీపీలో 3.5శాతంగా ఉన్న రాష్ట్ర వాటా ను తొమ్మిదిన్నరేండ్లలో 5 శాతానికి పైగా పెంచడం జీఎస్డీపీ వృద్ధిరేటులో పెరుగుదల ఏ స్థాయి లో నమోదైందో చెప్పకనే చెప్తున్నది.
21
ఐదేండ్లలో జీఎస్టీ 125%వృద్ధి
ఒక రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్ఠిగా మారాలంటే పన్ను వసూళ్లది కీలక పాత్ర. దేశ ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్ర, దేశానికే రోల్‌మోడల్ అని బీజేపీ పదేపదే వల్లె వేస్తున్న గుజరాత్ కంటే తెలంగాణ జీఎస్టీ రాబడిలో కనీవినీ ఎరుగని వృద్ధి సాధించింది. ఐదేండ్లలోనే జీఎస్టీ వసూళ్లలో 125 శాతం వృద్ధిరేటు నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ.28,786 కోట్ల జీఎస్టీ వసూలు అయ్యింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.51,870 కోట్ల జీఎస్టీ రాబడి వచ్చింది. అంటే ఐదేండ్లలో జీఎస్టీ ఆదాయం రూ.23,084 కోట్లు పెరిగింది. కేసీఆర్ సారథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా మారింది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పనితీరును, సంస్కరణలను అధ్యయనం చేసేందుకు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తోపాటు అనేక రాష్ర్టాల ప్రతినిధులు మన రాష్ట్రంలో పర్యటించడం గమనార్హం.
సొంత పన్నుల రాబడిలోనూ రాకెట్ వృద్ధి
ప్రజలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి చెల్లించే పన్నులను కలిపి సొంత పన్నుల రాబడిగా పిలుస్తుంటారు. సొంత పన్నుల రాబడి పెరగడాన్ని ప్రజల కొనుగోలు శక్తి, రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు పెరిగాయనడానికి ప్రతీకగా భావిస్తుంటారు. వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధి.. ఇలా ఏదో ఒక రూపంలో ప్రజలకు ఆదాయం పెరిగితేనే కొనుగోళ్లు పెరుగుతాయి. రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు ఉంటేనే పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, వాణిజ్య సంస్థలు తరలివచ్చి, వాటి ద్వారా పన్ను ఆదాయం పెరుగుతుంది. తెలంగాణ ఏర్పడే నాటికి సొంత పన్నుల ఆదాయం కేవలం రూ.29వేల కోట్లు. కానీ పదేండ్లలోనే రూ.1.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే నాలుగు రెట్లకుపైగా వృద్ధి నమోదైంది. ఈ గణాంకాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సొంత పన్నుల రాబడిలో తెలంగాణ వృద్ధి (రూ. కోట్లలో)
మూడింతలు పెరిగిన బడ్జెట్
రాష్ట్రం ఆర్థికంగా బలపడిందనడానికి మరొక నిదర్శనం బడ్జెట్. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ.లక్ష కోట్లు. పదేండ్ల తర్వాత బడ్జెట్ మూడు రెట్లు పెరిగి దాదాపు రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. ఏ ప్రభుత్వమైనా రాష్ర్టానికి రాబడి పెరిగినప్పుడే రంగాల వారీగా కేటాయింపులు పెంచుతుంది. తదనుగుణంగా నిధులు విడుదల చేస్తూ ఖర్చు పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు డిసెంబర్లో
విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం చూసుకున్నా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 9 ఏండ్లలో రూ.14.87 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రూ.12.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
రేవంత్ రెడ్డీ.. దీనిని అభివృద్ధి అంటారా? ఆర్థిక విధ్వంసం అంటారా?
ఎకానమిస్ట్ ఏమన్నదంటే?
కొత్త రాష్ట్రమైనప్పటికీ, పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. దేశంలోని మరిన్ని కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు ఓ సక్సెస్ఫుల్ మాడల్‌గా నిలిచింది. దేశ జనాభాలో 2.9 శాతం మాత్రమే వాటా కలిగిన తెలంగాణ జీడీపీలో మాత్రం అనూహ్యంగా 4.9 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం.
– బ్రిటిష్ వీక్లీ ‘ది ఎకానమిస్ట్’ (జూలై, 2023)
కరోనా సమయంలోనూ రాకెట్ వేగం
2020-21లో ఒకవైపు కరోనా మహమ్మారి సంక్షోభం యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా మరోవైపు, తెలంగాణకు కేంద్రం ఏకణా ఇవ్వకున్నా కేసీఆర్ నేతృత్వంలోని అప్పటి తెలంగాణ సర్కారు ఎంతమాత్రం వెనుదిరిగి చూడలేదు. ఆ సమయంలోనే దేశ జీడీపీ (-) మైనస్ 1.4 శాతానికి పడిపోగా, తెలంగాణ మాత్రం (+) 1.2 వృద్ధిరేటును నమోదు చేసింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రం ఈ సంక్షోభ సమయంలో ఈ వృద్ధిరేటును సమోదు చేయకపోవడం గమనార్హం.
ఆరుగురు బీహారీలు.. మనోడు ఒక్కడు
మనకంటే వందేండ్ల ముందే రాష్ట్రంగా ఏర్పడి, మూడు రెట్లు ఎక్కువ జనాభా కలిగి ఉన్న బీహార్ పౌరుడి తలసరి ఆదాయం రూ.54,383 మాత్రమే, అంటే బీహార్‌లోని ఆరుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఆర్జించే సంపాదనను తెలంగాణలో ఒక్క వ్యక్తే సంపాదించగలడు.
తలసరిలో టాప్
కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ మినహాయిస్తే, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,03,889 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564. అంటే తొమ్మిదిన్నరేండ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ కనీవినీ ఎరుగని వృద్ధిని నమోదు చేసింది. తక్కువ సమయంలోనే తలసరి ఆదాయం మూడున్నర రెట్లు పెరిగింది. తొమ్మిదిన్నరేండ్లలోనే తలసరి ఆదాయం రూ.2,52,675 (249 శాతం) పెరిగింది. దేశంలో తక్కువ సమయంలో భారీగా తలసరి ఆదాయ వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. తలసరి వృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు మెరుగ్గా ఉన్నది. దేశ సగటుతో పోలిస్తే, తెలంగాణ పౌరుడి సంపాదన 1.5 లక్షలు ఎక్కువ.
ఏమిటీ తలసరి, ఏమిటీ జీఎస్డీపీ?
ఒక దేశంగానీ, రాష్ట్రంగానీ అభివృద్ధి చెందిందని చెప్పేందుకు పౌరుల తలసరి ఆదాయాన్ని గీటురాయిగా తీసుకుంటారు. తలసరి ఆదాయ వృద్ధిరేటు ఆ దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రగతికి సూచీగా నిలుస్తుంది. ఏడాదిలో పౌరుడు సంపాదించే మొత్తాన్నే తలసరి ఆదాయంగా పరిగణిస్తారు. ఇక, జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)/జీఎస్డీపీ (స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి)ని వ్యవసాయం, తయారీ రంగం, విద్యుత్తు, గ్యాస్ పంపిణీ, గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, హోటల్స్, నిర్మాణం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా, వాణిజ్య సేవలు, సామాజిక రంగం, ప్రజాసేవలు తదితర రంగాల నుంచి సేకరిస్తారు. దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిందా? లేదా మందగమనంలోకి వెళ్తుందా? అని నిర్ణయించడంలో జీడీపీ/జీఎస్డీపీనే కీలకం. జీడీపీ వృద్ధి చెందుతుందంటే ఆ దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా, సంక్షేమపరంగా అభివృద్ధిలో పురోగమిస్తుందని అర్థం.