Nizamabad Encounter | నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి నివేదికను సమర్పించాలని డీజీపీ శివధర్‌రెడ్డికి ఆదేశించింది. నిజామాబాద్‌లో ఎన్‌కౌంటర్‌పై వచ్చిన వార్తల ఆధారంగా హెచ్ఆర్సీ పరిగణలోకి తీసుకుంది. రియాజ్ సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్ సర్వీస్ ఆయుధాన్ని లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడని, ఆ తర్వాత పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని, ఫలితంగా అతను మరణించాడని పోలీసులు తెలిపారు.
ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందినట్లు డీజీపీ సైతం స్పష్టం చేశారు. రియాజ్ ఎన్కౌంటర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని ఈ సందర్భంగా మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ఘటనకు సంబంధించిన నివేదికను నవంబర్ 24లోగా ఇవ్వాలని.. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, ఎఫ్ఐఆర్, పోర్టుమార్టం నివేదిక ఇవ్వాలని సూచించింది.
ఇదిలా ఉండగా.. రౌడీషీటర్ రియాజ్.. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా దాడికి పాల్పడ్డాడు. ప్రమోద్ ఆసుపత్రిలో మృతి చెందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత రియాజ్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. స్నేహితుడి బైక్‌పై మహ్మదీయకాలనీకి వెళ్లి బట్టలు మార్చుకొని.. నగరంలోనే పలు ప్రాంతాల్లోనే తప్పించుకొని తిరిగాడు. రియాజ్ నగరంలోనే ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు తారపడగా.. పట్టుకునే లోపు కెనాల్లోకి దూకి తప్పించుకున్నాడు. ఆదివారం సారంగాపూర్ శివారులో ఉన్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో దాక్కోగా.. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. దాంతో రియాజ్ కత్తితో ఆసిఫ్‌ను గాయపరిచాడు. ఈలోగా పోలీసులు రియాజ్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో రియాజ్‌కు సైతం గాయాలు కాగా.. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్ను లాక్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. దాంతో రియాజ్ తూటా గాయాలతో చనిపోయాడు.