గద్వాల/అయిజ/శ్రీశైలం, జూలై 19 : కృష్ణా, తుంగభద్ర నదులకు వరద హోరు కొనసాగుతున్నది. కొద్ది రోజులుగా శాంతించిన కృష్ణమ్మ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదిపై ఉన్న కర్ణాటక, తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు శనివారం వరద ప్రవాహం పెరగడంతో డ్యామ్ 23 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 1.14 లక్షల క్యూసెక్కులు ఉండగా, మొత్తం అవుట్‌ఫ్లో 1,21,994 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.279 టీఎంసీలు నిల్వ ఉన్నది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు 39,683 క్యూసెక్కులు వస్తుండగా.. 9 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేర ఎత్తి దిగువకు 26,910 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసుల బరాజ్‌కు 35,848 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. జూరాల, సుంకేసుల నుంచి దాదాపు 1,58,636 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 196.5611 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల నుంచి దిగువకు 68,835 క్యూసెక్కులు విడుదల చేశారు. వరద ప్రవాహం పెరగడంతో 24 గంటల్లో డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
మహదేవపూర్/కన్నాయిగూడెం, జూలై 19 : మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్‌కు గోదావరి వరద ప్రవాహం తగ్గుతున్నది. శనివారం బరాజ్ ఇన్‌ఫ్లో 82,330 క్యూసెకులుగా ఉన్నది. బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గడంతో సమ్మక్క బరాజ్ 30 గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి 80 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 59 గేట్లకుగాను 29 గేట్లను ఎత్తి 76,730 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.