దహెగాం/ కొల్లాపూర్ రూరల్/యాదగిరిగుట్ట, అక్టోబర్ 8 : బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరుతున్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం మొట్లగూడ, రావులపల్లి, రాంపూర్, దిగడ, ఖర్జీ, గిరివెల్లి, గెర్రె, ఒడ్డుగూడ గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో కారెక్కారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలే రు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తుర్కపల్లి మండలం దయ్యంబండ తండా గ్రామ పరిధిలోని మంచిరోని మామిళ్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గౌడ సంఘం అధ్యక్షుడు తాటికొండ రాజుగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వకుడోత్ రవినాయక్, బబ్లూ నాయక్ తండాకు చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ మాడొత్ రమేశ్ నాయక్‌తోపాటు 200 మంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.