నల్లగొండ: జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా వాహనాల రద్దీ (Traffic) కొనసాగుతుంది, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో ఈ రద్దీ మొదలైంది. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన రద్దీ సోమవారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఒకరోజులో వాహనాలు రద్దీ తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనేవి.
కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా వరుసగా మూడో రోజూ రద్దీ కొనసాగుతూ ఉండటంతో ప్రజలు.. ముఖ్యంగా అత్యవసర పనులపై హైదరాబాద్ వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిపై రద్దీ తీవ్రంగా ఉండడంతో చిట్యాల పట్టణంలో చిన్న వాహనాలను సర్వీస్ రోడ్డు వెంట పంపిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలను ఫ్రీగా వదిలితే ఈ రద్దీ ఇంతగా ఉండకపోయేదని పలువురు పేర్కొంటున్నారు. దసరా పండుగకి పరిస్థితి ఇలా ఉంటే సంక్రాంతి పండుగ వస్తే ఎలా ఉంటుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.