హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖానలో రోగులకు ఇవ్వాల్సిన ఆహారాన్ని అధికారులు, సిబ్బంది భోంచేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ కుంభకోణం కొన్ని లక్షల రూపాయల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. దవాఖాన తాత్కాలిక సూపరింటెండెంట్ ఆడిట్ నిర్వహించగా.. ఈ వ్యవహారం బయటపడింది. డైట్ కమిటీ లేకుండానే నర్సింగ్ విభాగం నుంచి పైస్థాయి వరకు పలువురు అధికారులు ఈ దోపిడీకి తెరలేపినట్టు సమాచారం. దవాఖానలో 204 బెడ్లు ఉన్నప్పటికీ నిత్యం 40-50 మించి ఇన్‌పేషెంట్లు ఉండరని సిబ్బంది చెప్తుండగా… లెక్కల్లో మాత్రం 170-180 మందికి డైట్ ఇస్తున్నట్టు చూపి బిల్లులు జారీచేస్తూ భారీ దోపిడీకి తెరలేపినట్టు తెలిసింది. ఇన్‌పేషెంట్‌కు రూ.80 వారి సహాయకులకు సైతం డైట్ కింద నిధులు కేటాయిస్తుండటంతో కేటుగాళ్లు ఈ స్కామ్‌కు తెరలేపినట్టు తెలిసింది.
ప్రతినెల గరిష్ఠంగా రూ.4.6 లక్షల వరకు డైట్ బిల్లులు వస్తుండగా, అందులో సగం కొంతమంది జేబుల్లోకి వెళ్తున్నట్టు ఆరోపణలున్నాయి. ర్యాంకులు కాపాడుకునేందుకు కృత్రిమంగా ఇన్‌పేషెంట్ల సంఖ్యను పెంచి చూపుతున్నట్టు వెల్లడైంది. డైట్ లెకలు, రోగుల కేస్షీట్లకు మధ్య పొంతన లేకపోవడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సాంలో భాగస్వాములైన అధికారులు పదోన్నతులు పొంది వేరే విభాగంలో ఉన్నతస్థాయి అధికారులుగా కొనసాగుతున్నట్టు సమాచారం. దీంతో వారు తమ పలుకుబడిని ఉపయోగించి కేసును తారుమారు చేసే అవకాశం ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం ఆయుష్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేరింది. ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభమై పలువురు అధికారులకు నోటీసులు జారీచేశారు. ఈ సాంలో భాగమైన కొందరు అధికారులు విచారణ అధికారులను ప్రభావితం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఒక అధికారి పదోన్నతులు కల్పిస్తానని కొందరు ఉద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు కూడా వెలుగులోకి రావడం మరింత సంచలనం రేపుతున్నది. ఈ సాం దర్యాప్తులో తవ్వే కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తుండగా.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దవాఖాన సిబ్బంది, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.