కమాన్ పూర్, ఫిబ్రవరి 9: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ (Kamanpur) మండలంలోని స్వయంభూగా నల్ల రాతి బండ పై ‘వరాహ’ రూపంలో వెలిసిన ఆదివరాహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకుంది. స్వామి వారి క్షేత్రం చుట్టూ ప్రదక్షణాలు చేసి, అలాగే ఆలయం ఆవరణలో గల సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, స్వామి వారి పాదముల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు ముక్కుకున్నారు. మరికొంత మంది భక్తులు తమ కోర్కెలు ఫలించాలని స్వామి వారికి ముడుపులు కట్టారు. హారతి, ఆశీర్వచనాలు తీసుకున్న అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం ఆవరణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు అన్న దాతలు భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు.
మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాశేశ్వరంలో మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరుగుతున్నది. 1982లో కాళేశ్వర ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో మహాకుభాభిషేకం నిర్వహించగా, మళ్లీ 42 ఏండ్ల తర్వాత శ్రీసచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలోఅంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయమూర్తులకు, గోపుర కలశాలకు పుణ్యజలాలతో అభిషేకాలు నిర్వహించారు. మహాకుంభాభిషేకాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరం త్రివేణిసంగమంలో పుణ్యస్నానమచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అభిషేకంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.