యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అదేరోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. చండూరులోని తాసీల్దార్ కార్యాలయంలో శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. బరిలో నిలిచేందుకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
శుక్రవారం ఒక్క రోజే భారీగా నామినేషన్లు వేశారు. రాత్రి 10.30 గంటల వరకు 129 నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. అధిక సంఖ్యలో నామినేషన్లు రావడంతో రాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. మొత్తంగా ఉప ఎన్నిక కోసం 185 మంది నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారులు శనివారం నామినేషన్లను పరిశీలించనున్నారు. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. 6న కౌంటింగ్ జరుగనుంది.