ఖమ్మం, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇంకా వరద కష్టాలు తీరనేలేదు. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయి, ఇంటి నిండా బురద పేరుకుపోయినా అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. కాలనీలన్నీ చీకట్లోనే మగ్గిపోతున్నాయి.
సర్కారు సహాయ సహకారాలు అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇస్తామన్న రూ.10 వేల సాయం అందనేలేదు. ప్రధాన వీధుల్లోకి ట్యాంకర్లు వస్తున్నా లోపలి ప్రాంతాల్లోకి, కాస్త ఇరుకైన సందుల్లోకి వెళ్లడం లేదు. దీంతో ముంపు ప్రాంతాలైన గణేశ్‌నగర్, మాణిక్యనగర్, బొక్కలగడ్డ, మోతీనగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులైన బురద బాధ తొలగలేదు.
పూర్తిగా తడిచి ఇంటి ముందు పోగుపడిన సామగ్రిని ఎలా తీసుకెళ్లాలో తెలియక దీనంగా చూస్తున్న ఖమ్మం కాల్వొడ్డుకు చెందిన వృద్ధురాలు
ప్రభుత్వం 10 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందిస్తున్నా కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలమైన వారికే వాటిని అందజేస్తున్నట్టు స్థానిక వరద బాధితులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం అందించేందుక అధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి వారి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. బురదతో కూరుకుపోయి మట్టిపట్టిన వాహనాలను వాటి యజమానులు మరమ్మతుల కోసం షెడ్లకు తరలిస్తున్నారు. ఎఫ్‌సీఐ రోడ్డులో నిలిపి ఉన్న లారీల్లో బురద పట్టడంతో వాటిని అక్కడే నిలిపి మెకానిక్‌లతో మరమ్మతులు చేస్తున్నారు.
ఖమ్మం కాల్వొడ్డులో తడిచిన పనికిరాని సామగ్రిని రోడ్డుపై కుప్ప వేసిన కాలనీవాసులు
జిల్లాలో ముగ్గురు మంత్రులు పేరుకే ఉన్నారు. వారి వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. భారీ వర్షాలు, వరదల గురించి అధికారులు మంత్రులకు చెప్పలేదా? చెబితే మంత్రులు మమ్ములను ఎందుకు పట్టించుకోలేదు? మంత్రుల బంధువులో, కుటుంబ సభ్యులో ఈ ప్రాంతంలో ఉంటే ఇలాగే చేస్తారా చెప్పండి? ఎన్నికలప్పుడు నీతి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మాకు కష్టాలు రాగానే కనీసం కన్పించడం లేదు.
-మంగ, కాల్వొడ్డు, ఖమ్మం
వర్షాలు కాస్తంత తెరిపినివ్వడంతో ఊపిరి పీల్చుకున్న ఖమ్మం వాసులు ఇంట్లోకి చేరిన బురద, చెత్తాచెదారాన్ని బుధవారం శుభ్రం చేసుకుంటూ కనిపించారు. నీళ్లు పోయినా వీధులన్నీ ఇంకా బురదమయంగానే దర్శనమిస్తున్నాయి
వరద తగ్గి నాలుగు రోజులవుతున్నా రోడ్లను ఇంకా శుభ్రం చేయట్లేదు. నిరుడు వరదలోనే అప్పటి మంత్రి అజయ్‌కుమార్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరదల సమయంలో ఆయన కూడా మాతోనే ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో మాతోనే తిన్నారు. ఇప్పటి నాయకులెవరూ అలా చేయలేరు.
-జయమ్మ, వెంకటేశ్వరనగర్, ఖమ్మం
4 రోజుల నుంచి చీకట్లోనే ఉంటున్నాం. మా ప్రాంతానికి అధికారులు సరిగా లేరు. అండగా ఉండే నాయకులూ లేరు. కొందరైతే అంతా అయిపోయాక వచ్చి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇస్తామన్న రూ.పది వేల సాయం ఇంకా ఇవ్వనేలేదు. సరుకులు ఇస్తామన్నారు. అవి కూడా కొద్దిమందికే ఇస్తున్నారట.
-సత్యవతి, బొక్కలగడ్డ, ఖమ్మం
నిరుడు వరదలొచ్చినప్పుడు కేసీఆర్ కాపాడారు. వరదలు వస్తాయని ముందే చెప్పడంతో మా వస్తువులను మేం కాపాడుకోగలిగాం. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. వరదలు వస్తాయని ప్రభుత్వం చెప్పలేదు. అందువల్లనే మాకు ఇంత నష్టం జరిగింది.
– చెరుకూరి జ్యోతి, పద్మావతినగర్, ఖమ్మం
మా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయాయి. క్వింటాళ్ల కొద్దీ బియ్యం తడిసి ముద్దయ్యాయి. ముఖ్యమంత్రి ఇచ్చే రూ.పది వేలు దేనికి సరిపోతాయి? నాలుగు రోజులైనా గ్యాస్ ముట్టించలేదు. ఆకలితోనే ఉంటున్నాం. కనీసం నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరు.
-అప్పమ్మ, మోతీనగర్, ఖమ్మం