Power Consumption | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్ కోతల ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఏప్రిల్, మేలో ఉండాల్సిన డిమాండ్ ఇప్పుడే నమోదవుతున్నది. ఇప్పటికే ఎండాకాలం రాకముందే విద్యుత్తుకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. గురువారం 14,785 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదయింది. మూడేండ్ల గణాంకాలు పరిశీలిస్తే జనవరి సగటు 13వేల మెగావాట్లు కాగా ఈ సారి 15వేలగావాట్లకు చేరువైంది.
విద్యుత్తు డిమాండ్ కొన్ని జిల్లాల్లో అధికంగా పెరిగింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే డిమాండ్ ఎక్కువైంది. కాలువల పారకం కంటే బోర్లు, బావుల మీదే ఎక్కవ అధారపడి వ్యవసాయం నడుస్తున్నది. డిమాండ్ పెరుగుదలకు ఇదో కారణమని చెప్తున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయి. కానీ మహానగరంలో సబ్స్టేషన్ల నిర్మాణం ముందుకుసాగడం లేదు. నిర్మాణానికి రెండు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ ముందుకురాలేదు. వేసవిలోపు సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయ్యేలా కూడా కనిపించడం లేదని విద్యుత్తుశాఖ అధికారులు చెబుతున్నారు.
రైతులు యాసంగి పనులను ముమ్మరం చేశారు. ఇక వేసవిలో విద్యుత్ సరఫరా భారీగా పరిస్థితి ఏంటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్‌ను అధిగమించేందుకు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్తు కొంటున్నామని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రం వినియోగించే సగం కరెంట్‌ను బయటి నుంచి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. విద్యుత్తు వినియోగం అంచనాలకు మించి పెరగడంతో డిస్కమ్‌లు రోజుకు రూ.8-9 కోట్లు వెచ్చించి విద్యుత్తును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్తు కొనకపోతే వేసవిలో కరెంటు కోతలు తప్పవని జనం ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : గత వేసవిలో విద్యుత్తును అందించేందుకు ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడా పరిస్థితి రాకుండా చూడాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. సమర్థ్ధవంతంగా విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి విద్యుత్తు సరఫరాపై ప్రజాభవన్‌లో అధికారులతో సమీక్షించారు. విద్యుత్తు సరఫరాపై రైతులపై ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయి సమావేశాలను నిర్వహించాలని స్పష్టంచేశారు. సీఎండీల నుంచి ఎస్ఈ వరకు అంతా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు.