హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఐపీఎస్‌ల బదిలీపై ఉత్తర్వులు వెల్లడించింది. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తాను ఎగ్జిక్యూటివ్ వైస్ డైరెక్టర్ అండ్ డీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌గా నియమించింది. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ను కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసి, సిటీ సీపీగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేండ్లలోనే హైదరాబాద్ కమిషనరేట్‌కు సీపీలు మూడుసార్లు బదిలీ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి సందీప్ శాండిల్య సీపీగా ఉన్నారు.
2023 డిసెంబర్ 13న నగర కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఏడాది కూడా గడవకముందే నిరుడు సెప్టెంబర్ 9న సీవీ ఆనంద్‌కు సీపీగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు తాజాగా సజ్జనార్‌ను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కీలక విభాగాలైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు డీజీగా శిఖాగోయెల్‌కు, ఏసీబీ డీజీగా చారుసిన్హాకు బా ధ్యతలు అప్పగించింది. ఫైర్‌సేఫ్టీ విభాగానికి బీఆర్ఎస్ హయాం నుంచే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వై నాగిరెడ్డిని సజ్జనార్ స్థానం లో ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించిం ది. అక్రమాల ఆరోపణలతో వరుసగా వార్త ల్లో నిలుస్తున్న ముగ్గురు యువ ఐపీఎస్‌లపై నా ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.