హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో కొన్ని నెలలుగా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు, కొనుగోళ్లు, పాలసీ నిర్ణయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాన్ని అందించారు. సింగరేణిలో ఆర్థిక పరమైన అంశాలపై విజిలెన్స్ లేదని, ప్రజలు, కార్మికుల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి టెండరింగ్, వస్తుసామగ్రి సేకరణ, విధాన నిర్ణయాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) అంశాలు ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని చెప్పారు. దీని ఫలితంగా సింగరేణి సంస్థకు తీవ్రంగా ఆర్థిక నష్టం జరుగుతున్నదని.. పారదర్శకత, సంస్థాగత పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.
వినతిపత్రంలో ముఖ్యమైన అంశాలు
సమగ్ర విచారణ చేయించండి
ఎస్సీసీఎల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే తగిన సంస్థాగత విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను కోరారు. పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన టెండర్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధనతో పిలిచిన అన్ని టెండర్లను రద్దు చేసి సమీక్షించాలని కోరారు. ప్రకాశం ఖని వంటి భారీ టెండర్ల వాయిదాలపై విచారణ చేపట్టాలని, సంస్థకు సమర్థవంతమైన నాయకత్వాన్ని, పటిష్ఠమైన పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, మధుసూదనాచారి, సురభి వాణీదేవి, ఎల్.రమణ, దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.