మహబూబ్నగర్: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. దీంతో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు (Srisailam) పెద్దఎత్తున నీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇన్ఫ్లో మేరకు 2 నుంచి 4 గేట్లు ఎత్తనున్నారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 4,36,433 క్యూసెక్కుల వరద వస్తుండగా, 62,857 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 876.70 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటినిల్వ 215.8070 టీఎంసీలకుగాను ఇప్పుడు 171.8625 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.
జూరాల ప్రాజెక్టుకు 3.5 లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 41 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 317.73 మీటర్లు. జలాశయంలో ఇప్పుడు 5.42 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.