హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని, అధికారంలోకి వస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన హస్తం సరార్.. తీరా గద్దెనెకాక స్థానిక సంస్థలకు సరిగా నిధులివ్వకుండా నిర్వీర్యం చేస్తున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికే ఇందుకు నిదర్శనం. గ్రామీణ వికాసానికి కేంద్ర బిందువులైన పంచాయతీరాజ్ సంస్థలకు అందుతున్న నిధుల్లో రేవంత్రెడ్డి సర్కార్ భారీగా కోత పెట్టినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.
సోమవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఈ నివేదికను విడుదల చేసింది. అందులోని గణాంకాల ప్రకారం.. కేంద్రం నుంచి పంచాయతీలకు వస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తన అవసరాలకు మళ్లించుకోవడంతోపాటు తన వంతుగా గ్రామాలకు ఇచ్చే గ్రాంట్లను కూడా క్రమంగా తగ్గిస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్ సంస్థలకు రూ.10,075 కోట్లు అందగా.. 2024-25లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 10% నిధులను తగ్గించి రూ.9,083 కోట్లు మాత్రమే ఇచ్చింది.
తద్వారా ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన సర్పంచ్లను కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు నిరుడు రూ.3,631 కోట్లు ఇచ్చి, ఈ ఏడాది కేవలం రూ.1,959 కోట్లతో సరిపుచ్చింది. అలా ఏకంగా 46% నిధులను నిలిపివేసి పీఎస్యూలను సంక్షోభంలోకి నెట్టిన రేవంత్రెడ్డి సర్కార్.. రాష్ట్రంలోని వివిధ సంస్థలకు ఇచ్చే మొత్తం గ్రాంట్లను రూ.76,773 కోట్ల నుంచి రూ.74,272 కోట్లకు (3 శాతం) తగ్గించింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఎస్ఎఫ్సీ, ఎస్డీఎఫ్ నిధుల్లోనూ కోత విధించడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మంచినీటి సరఫరా లాంటి కనీస వసతులకు నిధుల్లేని పరిస్థితి దాపురించింది. దీంతో పట్టణ స్థానిక సంస్థలకు నిధులను 4% పెంచిన ప్రభుత్వం పల్లెలను ఎందుకు విస్మరిస్తున్నదని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ స్వరాజ్యం గురించి బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా చెప్పిన ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క నిధుల విడుదలలో ఎందుకు మొండిచేయి చూపుతున్నారని నిలదీస్తున్నారు. ‘కాగ్’ తాజా నివేదికతో కాంగ్రెస్ సరార్ ‘పల్లె వ్యతిరేక’ వైఖరి బట్టబయలైందని మండిపడుతున్నారు. ఇప్పటికే అప్పుల పాలైన పంచాయతీలను ఆదుకోకపోతే వాటి పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
