Bar License Applications | జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు విశేష ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్ కోసం 3,668 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు రాగా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ జల్పల్లి మున్సిపాలిటీలోని బార్‌కు 57 దరఖాస్తులు, మహబూబ్‌నగర్‌లోని బార్‌కు 49, నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని బార్‌కు 15 దరఖాస్తులు వచ్చాయి.
ఈ మొత్తం దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.36.68 కోట్ల ఆదాయం వచ్చింది.జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు వచ్చిన దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ డ్రా ద్వారా బార్ల యజమానులను ఎంపిక చేయనున్నారు. జిల్లాల్లోని బార్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు యజమానులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన డ్రా పద్ధతి ద్వారా బార్ హోల్డర్ ఎంపిక జరుగుతుందని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ తెలిపారు. డ్రా ఎక్కడెక్కడ అనే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని పేర్కొన్నారు.