మణికొండ, మే 7: హైదరాబాద్ శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడ రెవెన్యూలో ల్యాంకోహిల్స్ సర్కిల్- ఓఆర్ఆర్ రోడ్డు వరకు చేపట్టిన 100 అడుగుల రోడ్డు నిర్మాణ వార్ రెండోరోజు కొనసాగింది. చివరి దశకు పనులు చేరాక.. మిగిలిపోయిన రోడ్డు పనులను సివిల్ సర్వెంట్లతో కూడిన ఆదర్శనగర్ హౌసింగ్ సొసైటీ సభ్యులు శనివారం అడ్డుకొన్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో హెచ్ఆర్డీసీఎల్ సీఈ సరోజ ఆధ్వర్యంలో ఆదర్శనగర్ సొసైటీకి చేరుకొన్న అధికారులు.. మళ్లీ రోడ్డు పనులను ప్రారంభించారు.
విషయం తెలుసుకొన్న పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు అక్కడికి చేరుకొన్నారు. రోడ్డు పనులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తమ స్థలంలోకి వస్తే ఊరుకోబోమని, పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కానీ, హెచ్ఆర్డీసీఎల్ అధికారులు మాత్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు పనులు కొనసాగించారు. ప్రజల అవసరాల మేరకు ఈ పనులు పూర్తి చేసి తీరుతామని అధికారులు తేల్చి చెప్పారు.