యాచారం, మార్చి18: మార్చిలోనే ఎండలు (Summer Heat) మండిపోతున్నాయి. మండుటెండలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడు రోజురోజుకు నిప్పుల వర్షం కురిపించడంతో ఇప్పుడే 37నుంచి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండవేడిమిని తట్టుకోలేక రోజువారి కూలీలు, రైతులు, ఉపాధి కూలీలు చిన్న పిల్లలు, వృద్దులు, రోగులు అల్లాడుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఎప్రిల్, మే నెలల్లో ఎండ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. కొంతమంది ఎండలో బాగా తిరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి బలహీనత చోటుచేసుకుంటుంది. దీంతో బ్లడ్ప్రషర్ పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాటు తలనొప్పి, తల తిరగడం లాంటి అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎండవేడిమికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వడదెబ్బ తీవ్రతతో ప్రాణాలను సైతం కోల్పోవల్సి వస్తుంది. వడదెబ్బ తగలకుండ ఉండేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చని మండల సీఎస్సీ వైద్యురాలు ప్రియాంక తెలిపారు. తగిన సలహాలు, సూచనలు అందజేశారు.
వడదెబ్బ లక్షణాలు
వేసవిలో ఎంతో మంది ప్రజలు వడదెబ్బతో ఎన్నో అవస్థలు పడుతుంటారు. కొంత మంది ఏకంగా ప్రాణాలను సైతం కోల్పోతారు. వడదెబ్బ లక్షణాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారీ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. వడదెబ్బకు గురైన వారి శరీరం వేడిగా ఉండి చెమట పట్టదు. చర్మం వేడిగా, పొడిగా మారి ఎర్రబడుతుంది. విపరీతమైన తలనొప్పి, తల తిరుగుడు, కండ్లు తిరిగి పడిపోవడం లాంటి సమస్యలు బాదిస్తాయి. శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. అలసట, నిసత్తువ నెలకొంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరగడం సంబవిస్తుంది. చిరాకు, కంగారు, అపస్మారక స్థితితో ఇబ్బందులెదుర్కొంటారు. వాంతులు సంబవిస్తాయి. మానసికమైన కలత, పెద్దవారు స్పృహకోల్పోవడం. చివరకు మెదడు పనితీరు మారిపోవడం లాంటి అనేక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
వీరిపై ప్రభావం అధికం
వడదెబ్బతో కొంత మంది సాధారణ వ్యక్తులకంటే అధికంగా బాధపడుతారు. వారిలో మొదటగా చిన్నపిల్లలు, వృద్దులు, స్థూలకాయులు, గర్బణీ స్త్రీలు, గుండె జబ్బు వ్యాధిగ్రస్తులు, క్రీడాకారులు, అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్నవారు, అధింకంగా మద్యపానియాలు సేవించేవారు, ఎండలో ఎక్కవగా తిరుగనివారు, కొన్ని రకాల మందులు నిత్యం వేసుకునేవారికి వడదెబ్బ అధికంగా సంబవిస్తుంది.
ప్రథమ చికిత్స..
ఎండదెబ్బకు గురైన వ్యక్తికి సత్వరమే ప్రథమ చికిత్స చేయాలి. చికిత్సలో ఆలస్యమైతే శరీర అవయవాలు దెబ్బతినడంతో పాటుగ ప్రాణాపాయస్థితి నెలకొనె అవకాశాలున్నాయి. వైద్యుల వద్దకు వెళ్లేలోపే ప్రథమ చికిత్స తప్పనిసరిగా చేయాల్సిందే. వడదెబ్బకు గురైన వారిని శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు వెంటనే నీడకు చేర్చాలి. దుస్తులు విప్పి చల్లటి గుడ్డతో శరీరాన్ని తూడ్చాలి. ఎండ దెబ్బకు గురైన వ్యక్తికి చల్లని గాలి తగిలేలా చూడాలి. శరీర ఉష్ణోగ్రత సాదారణ స్థాయికి తీసుకొచ్చేలా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణం, నిమ్మరసాన్ని తాగించాలి. వీలైనంత త్వరగా దవాఖానాకు తీసుకెళ్లాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ముందు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బకు గరికాకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఎండవేడిమి నుంచి తగిన జాగ్రత్తలతో ఉపశమనం పొందవచ్చు. వేసవిలో వదులుగా ఉండే తెల్లటి కాటన్ దుస్తులను అధికంగా దరించాలి. జీన్స్లాంటి మందంగా, బిగుతుగా ఉండే దుస్తువులను వాడొద్దు. ఎండలో వెళ్లిన ప్రతిసారి తలకు టోపిని దరించాలి. అవపరమైతే గొడుగును ఉపయోగించాలి. కండ్లకు చల్లదనాన్నిచ్చే కూలింగ్ అద్దాలు దరించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ దరించాలి. హెల్మెట్ పెట్టుకునే ముందు నీళ్లలో తడిపిన తెల్లటి గుడ్డను తలకు కట్టుకోవాలి. ఎండలో పనిచేసేవారు గంటకు తప్పనిసరిగా 4లీటర్ల నీటిని తాగాలి. ఇంటి పట్టున ఉండేవారు రోజుకు 15గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. పుచ్చకాయలు, దోసకాయలు, ద్రాక్ష పండ్లు, నిమ్మరసం, పండ్లరసం అధికంగా తీసుకోవాలి. చెమట ద్వారా కోల్పోయే లవణాలను తిరిగి పొందేందుకు కొబ్బరినీళ్లు, ఉప్పు పంచదారా కలిపిన నీటిని తాగాలి.
ఎండలో ఎక్కవసేపు ప్రయాణం చేయవలిసి వస్తే రెండుగంటలకోసారి కొద్దిసేపు నీడకు విశ్రాంతి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులో మిట్ట మధ్యాహ్నం పిల్లలను, వృద్దులను బయటకు పంపొద్దు. కారం, మసాలా పదార్థాలను తగ్గించాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, రాగి అంబలి, జోన్న అంబలి తీసుకోవాలి. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచడం, ఫ్యాన్లు, కూలర్లు ఉపయోగించడం చేయాలి. బోజనం మితంగా చేయాలి. మద్యం, మాంసాహారంతో పాటు రోడ్లపైన అమ్మె కలుషిత ఆహారం, రంగుపానియాలు తీసుకోరాదు. ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా చూడాలి, అవసరమైతే దోమతెరలను వాడాలి. మధ్యాహ్నం 12గంటల నుంచి 4గంటల వరకు బయటకు వెళ్లకుంటే వడదెబ్బనుంచి కాపాడుకోవచ్చు.
జాగ్రత్తలు పాటించాలి: డాక్టర్ ప్రియాంక
వేసవిలో ప్రజలను వడదెబ్బ ఇబ్బందులకు గురిచేస్తుంది. వడదెబ్బకు గురైనవారికి సరైన సమయంలో ప్రథమ చికిత్సను అందించాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండలో తిరగకూడదు, టోపీలు, గొడుగులు, కూలింగ్ అద్దాలు వాడాలి. కాటన్ దుస్తులవులను వాడలి. రోజుకు 3నుంచి 4లీటర్ల మంచినీరు తాగాలి, నిమ్మరసం, పండ్లరసం, కొబ్బరిబొండాం, పుచ్చకాయలు లాంటి సీతల పానియాలు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలతో ఎండవేడిమి నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.