Harish Rao | మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు. ఒకసారి లక్ష కోట్లు అన్నారని.. మరోసారి లక్షన్నర కోట్లు అన్నారని తెలిపారు. మూసీ సుందరీకరణకు ఒరిజినల్ వ్యయమెంత అని నిలదీశారు.
రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ కోసం ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కూల్చివేశారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులందరికీ ఇండ్లు ఇచ్చారా అని అడిగారు. ప్రాజెక్టు కోసం ఎంత ప్రైవేటు భూమిని సేకరిస్తున్నారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.14.50 లక్షల చొప్పున నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అలాగే 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మరి నిర్వాసితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు.
మూసీలోకి నీళ్లు తీసుకొస్తామని మంత్రి చెప్పారని హరీశ్‌రావు తెలిపారు. రెండున్నర టీఎంసీల గోదావరి జలాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తున్నారా? లేదా గాలిలో నుంచా అని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు ఎంత ఖర్చు పెట్టాలని ప్రభుత్వం అనుకుంటుందో సమాధానం చెప్పాలన్నారు.
మూసీలోకి మురుగునీరు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30కి పైగా ఎస్టీపీలు నిర్మించామని, వికారాబాద్‌లో కూడా ఎస్టీపీలు నిర్మించామని తెలిపారు. కానీ అవి ఇప్పుడు పనిచేయడం లేదన్నారు. ఇటీవల వచ్చిన మూసీ వరదలపైనా హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. అసలు జంట జలాశయాల్లోకి ఎంత వరద నీరు వస్తుందో తెలుసా అని ప్రశ్నించారు. ఒకేసారి ఉద్దేశపూర్వకంగా జలాశయాల గేట్లు ఎత్తారా అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను ముంచడానికే గేట్లు తెరిచారా అని అడిగారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకుని కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.