ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 13:38:44

కేంద్రంపై ఎన్నిఛార్జ్‌షీట్లు వేయాలి : మంత్రి కేటీఆర్‌

కేంద్రంపై ఎన్నిఛార్జ్‌షీట్లు వేయాలి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఎన్నికల వేళ హామీలతో ఉదరగొట్టి ఓట్లు దండుకొని అమలు చేయకుండా ప్రజలను మోసగించిన కేంద్రంపై ఎన్ని ఛార్జ్‌షీట్లు వేయాలని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ను రద్దు చేసి కేంద్రం యువత పొట్టకొట్టిందన్నారు.  తెలంగాణలో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి.. సీలేరు ప్రాజెక్టును పోలవరంలో ముంచి అన్యాయం చేసిందన్నారు. బయ్యారం ఉక్కు ప్రాజెక్టు నెలకొల్పుతున్నామని మాట తప్పిందని, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్‌, నవోదయ పాఠశాలలను ఇంకా ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు.

అసమర్థ విధానాలతో చిరు వ్యాపారుల పొట్టకొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. దేశంలోని ఉద్యోగులను, పారిశ్రామిక వేత్తలను మోసగించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను దెబ్బతీశారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఎగవేత దారులను కాపాడారు. కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు.  రైతుల నడ్డి విరిచేలా నల్ల చట్టాలు తెచ్చారు. పీడీపీతో కలిసి కశ్మీర్‌లో పదవులు పంచుకున్నందుకు ప్రజలు బీజేపీపై ఛార్జ్‌షీటు వేయాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.  మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. 

అన్నింటినీ అమ్మేయడమే మీ విధానమా.?

వేల కోట్ల ఆదాయాన్ని స‌మ‌కూర్చే ప్రభుత్వ రంగం స్థంస్థల‌ను అడ్డీకి పావుసేరు అమ్ముతున్నది మీరు కాదా.?  అని మంత్రి కేటీఆర్‌ బీజేపీని నిలదీశారు. నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్ముతున్నామని అన్నారని.. మ‌రి లాభాల్లో ఉన్న ఎల్‌సీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. మ‌హార‌త్న‌, న‌వ‌ర‌త్న కంపెనీలను అమ్మేయడం దేని నిదర్శమని నిలదీశారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసేది..  దేశ భ‌విష్యత్ కోసమా.. ? ‌గుజ‌రాత్‌లో ఉండే కొంత‌మంది భ‌విష్యత్ కోస‌మా.? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీపీఎల్,ఎల్ఐసీ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారో.. రైల్వేస్‌ను ఎందుకు ప్రైవేటీక‌రిస్తున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  అన్నింటిని అమ్మేయాలి.. ప్రైవేట్‌ పరం చేయాలన్నదే బీజేపీ విధానమని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.  బీజేపీ అవకాశం ఇస్తే హైదరాబాద్‌నూ అమ్మేస్తుందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.