Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): నాడు… నేడు… రేపు& తెలంగాణకు రక్షకుడు కేసీఆరే. రెండున్నర దశాబ్దాలుగా, అనేక సందర్భాల్లో ఇది నిరూపణ అవుతూనే ఉన్నది. పాతికేండ్లుగా కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన మాట్లాడితే సంచలనం! మాట్లాడకపోతే అంతకన్నా పెద్ద సంచలనం!! తెలంగాణలో ఇప్పుడు ఉద్యమం లేదు, బీఆర్ఎస్ అధికారంలో లేదు. అయినా, రాజకీయాలు కేసీఆర్ చుట్టే పరిభ్రమిస్తున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీకి 17 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి మధ్య తేడా 2.05% ఓట్లే! అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నది. గతంలో మరి ఏ ఇతర ప్రతిపక్ష పార్టీకి దక్కని గౌరవాన్ని అతిస్వల్ప కాలంలోనే ప్రజలు బీఆర్ఎస్కు ఇస్తున్నారు. నిజానికి ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా, ప్రజల్లో రోజురోజుకూ ఈ ఆకాంక్ష ద్విగుణీకృతం అవుతుండటం కేసీఆర్ పట్ల తరగని ఆదరాభిమానాలకు నిదర్శనం.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మొదలుకొని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితోపాటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వంటి నేతల దాకా.. ఏ ఒక్కరూ.. అనునిత్యం కేసీఆర్ నామస్మరణ చేయకుండా ఉండలేదంటే అతిశయోక్తి కాదు. నాటి నుంచి నేటి దాకా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా.. ఏ మీడియాకు అయినా కేసీఆరే హాట్‌టాపిక్! ఎన్నికల రాజకీయాల్లో బీఆర్ఎస్ అప్రతిహత విజయాలు సాధించినా, విజయం అంచుల దాకా వెళ్లి ఆగిపోయినా, ఆఖరికి ఎన్నికల్లో పోటీచేయకపోయినా గడచిన 25 ఏండ్లుగా కేసీఆర్ పేరులేకుండా రాజకీయాలు సాగలేదు. 2001లో బీఆర్ఎస్ను స్థాపించి, స్వరాష్ట్ర సాధన కోసం 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటాన్ని నడిపి, సాధించుకున్న తెలంగాణను దేశం గర్వపడేలా తీర్చిదిద్దిన ప దేండ్లూ కేసీఆర్ చుట్టే రాజకీయాలు నడిచాయి. కేసీఆర్… ఉద్యమంలో లక్షల మెదళ్లను ఆలోచింపజేసినా, తన మాటల తూటాలతో మరఫిరంగులు పేల్చినా అవి తెలంగాణ రక్షణ కోసమేనని 25 ఏండ్ల చరిత్ర స్పష్టంచేస్తున్నది.
2001లో బీఆర్ఎస్ను స్థాపించి, 2014లో రాష్ర్టాన్ని సాధించే దాకా కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారు. పుట్టినగడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని అవమానాలను దిగమింగారు. తెలంగాణ ప్రజల కోసం అనేక సందర్భాల్లో పదవులను గడ్డిపోచల్లా విసిరికొట్టారు. ‘తెలంగాణ నినాదం నుంచి నేను తప్పుకుంటే.. నన్ను రాళ్లతో కొట్టి చంపండి’ అంటూ పిలుపునివ్వడం కేసీఆర్‌కే సాధ్యమైంది. తెలంగాణకు తాను ‘అడ్డమూ కాదు.. నిలువూ’ కాదు అన్నవాళ్లతోనే ‘జై తెలంగాణ’ అనిపించడం.. ‘మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అన్నవాళ్లతోనే ‘అనుకూలం’ అని లేఖ రాయించడం ఆయన వ్యూహ చతురతకు నిదర్శనం. ఎదుటివారి రాజకీయ అనివార్యతలను తెలంగాణకు అనుకూలంగా మలచి దానినే తెలంగాణకు బలంగా మార్చిన తీరు అద్భుతం. 2004లో బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకొని, అధికారంలోకి వచ్చిన తరువాత పొత్తు ధర్మాన్ని వీడిన కాంగ్రెస్ పార్టీకి, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో తనదైన శైలిలో జవాబిచ్చారు. తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించిన చంద్రబాబుతో 2009తో ఎన్నికల పొత్తుపెట్టుకొని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అనివార్యతను టీడీపీకి సృష్టించారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒప్పుకుంటే తెలంగాణ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మెలికపెట్టిన సందర్భంలో, 36 రాజకీయ పార్టీలను ఒప్పించి, తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించారు.
‘అసలు తెలంగాణ వాదమే లేదు’ అంటూ సమైక్య పాలకులు రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న దశలో, కేసీఆర్ తన రాజకీయ జీవితాన్నే పణంగాపెట్టిన సందర్భాలు అనేకం. ప్రాథమిక వ్యవసాయ కేంద్రం డైరెక్టర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసి ఏనాడూ ఓటమిని ఎదుర్కోని నాయకుడిగా చరిత్ర సృష్టించారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా బయలుదేరారు. 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో అద్భుత విజయాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. 2004లో ఒకేసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా రెండుచోట్లా విజయం సాధించడం విశేషం.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే ఏకైక లక్ష్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎంపీగా ఢిల్లీకి వెళ్లి, నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ వచ్చారు. యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్పించారు. అయితే, యూపీఏ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభించడంతో కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారు. ఆ తరువాత 2006లో కరీంనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, తద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా మరోసారి చాటిచెప్పారు. ఆ తరువాత ఉత్తర తెలంగాణలోని రెండు మూడు జిల్లాలకే తెలంగాణవాదం పరిమితం అంటూ సమైక్య పాలకులు, వారి ప్రలోభాలకు లోనైన స్థానిక నాయకులు చేస్తున్న వాదనలను తుత్తునియులను చేసేందుకు, 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేశారు. అక్కడ ఘన విజయం సాధించారు.
‘తెలంగాణ అంటే కేసీఆర్… కేసీఆర్ అంటే తెలంగాణ’ అన్నట్టుగా పాతికేండ్ల ప్రస్థానమే కా దు.. భవిష్యత్ కూడా ఇదే రీతిన సాగుతుందని 17 నెలలుగా నిరూపితం అవుతూనే ఉన్నది. ’తెలంగాణకు రక్షకుడు కేసీఆరే. రక్షణ క వచం బీఆర్ఎస్సే’ అనే నిర్దారణకు ప్రజలు రావ డం ఆ యనపై ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనం.
కాంగ్రెస్‌కు వచ్చిన మొత్తం ఓట్లు 92,33,784 (39.40%)
బీఆర్ఎస్కు వచ్చిన మొత్తం ఓట్లు 87,51,391 (37.35%)
రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 4,82,393 (2.05%) మాత్రమే