సూర్యాపేట, జూలై 13 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల తరబడి చుక్కనీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి కూడా పడావు పడకుండా సాగులోకి వచ్చింది. ఆ తర్వాత ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతులకు సాగునీటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. చిన్న సాకు చూపించి కాళేశ్వరాన్ని పక్కనబెట్టడంతో పొలాలకు నీళ్లందక మూడు పంట సీజన్లు ఎండిపోయాయి. ఉమ్మడి రాష్ట్రం నాటి కరువు పరిస్థితులు మళ్లీ కమ్ముకున్నాయి.
ప్రస్తుత వానకాలం కూడా అదును దాటుతున్నా తుంగతుర్తి నియోజకవర్గానికి చుక్కనీరు కూడా రావడం లేదు. రైతులు దుక్కులు దున్ని నార్లు సిద్ధం చేయగా మరో 15 రోజులైతే ఈ సీజన్ కూడా నష్టపోనున్నారు. ‘2023 వరకు రంది లేకుండా వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎవరి అసమర్థత వల్ల రావడం లేదు? అసలు తుంగతుర్తికి వచ్చింది కాళేశ్వరం జలాలే కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలు.. మంత్రులు పదేపదే అంటుంటే మరి ఆయాల వచ్చింది ఏ నీళ్లు? ఆ నీళ్లను మూడు సీజన్లకు ఇవ్వపోగా ఇప్పుడు వానకాలం పంటకు కూడా ఎందుకు ఇస్తలేరు? ఈరోజు తుంగతుర్తికి వచ్చే రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పే పోవాలి’ అని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎండిన చెరువులు.. బీడుపడ్డ పొలాలు.. బక్కచిక్కిన రైతులకు తుంగతుర్తి ప్రాంతం కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. సాగునీటి సంగతి అటుంచితే కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేక తుంగతుర్తి ప్రజలు విలవిలలాడేవారు. నియోజకవర్గంలో సాగు యోగ్యమైన భూములు 1,41,265 ఎకరాలు ఉండగా 2018 వరకు 15 వేల ఎకరాలకు మించి వరి సాగు కాలేదు. అదీ వందల మీటర్ల లోతు బోర్లు వేసి మోటర్లు బిగించి రోజుకు దాదాపు పది నుంచి పదిహేను విడతలుగా వచ్చే కరెంటు కోసం ఎదురుచూస్తూ సద్దులు కట్టుకొని మోటర్ల వద్ద పడిగాపులు కాస్తేనే అంతోఇంతో పంట పండేది.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో తుంగతుర్తిలో రైతులు ఇంచు భూమిని కూడా వదలకుండా పండుగలా సాగు చేసుకున్నారు. 2018-19 యాసంగిలో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల పరిధిలో 17,620 ఎకరాల్లో వరి సాగు కాగా 2019 నుంచి 2023 వరకు ఏటా రెండు సీజన్లలో 1,12,210 ఎకరాల్లో వరి సాగు చేస్తూ వచ్చారు. కేసీఆర్ హయాంలో తుంగతుర్తికి వచ్చిన నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినవి కావని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుండగా మరి మూడు సీజన్లలో పంటలను నీళ్లివ్వకుండా ఎందుకు ఎండబెట్టిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నాలుగో సీజన్‌కు కూడా నీళ్లు ఎందుకు రావట్లేదో నేడు తుంగతుర్తికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సమాదానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతి సారీ దాదాపు 80 వేల నుంచి లక్షకుపైగా ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఈ వానకాలం సీజన్‌కు అయినా కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వచ్చేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేనా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. మరో 15 రోజుల్లో వరి నాట్ల అదును దాటి పోనుంది. కానీ జిల్లాలోని గోదావరి జలాల ఆయకట్టులో దాదాపు 80 శాతం చెరువులు ఖాళీగా కనిపిస్తుండగా కనుచూపు మేరలో నీళ్లు వస్తాయనే ఆశలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలతో కళకళలాడిన సూర్యాపేట జిల్లా నేడు కాంగ్రెస్ సర్కారు నిర్వాకం కారణంగా కరువు ముంగిట నిలబడింది.
ఈ వానకాలానికి శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లా పరిధిలోని సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు గోదావరి జలాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు నీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు కాకపోవడంపై రైతులు అయోమయంలో ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో వానకాలానికైనా, యాసంగికైనా కాళేశ్వరం నుంచి జలాలు నిరంతరాయంగా విడుదలయ్యేవి. సీజన్‌కు 30 నుంచి 40 టీఎంసీల నీళ్లు వచ్చేవి. ఇప్పుడు ఎటు చూసినా ఖాళీ నీటి వనరులే కనిపిస్తున్నాయి.
జిల్లాలో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో 670 చెరువులు ఉండగా వీటిలో 400కు పైగా చెరువుల్లో నీటి నిల్వలు 25 శాతం మాత్రమే ఉన్నాయి. ఎస్సారెస్పీలోనూ 50 టీఎంసీలకు మించి లేనట్టు తెలుస్తుండగా, దిగువన ఉన్న ఎల్ఎండీలో 30 శాతం నీళ్లే ఉన్నాయి. మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బయ్యన్నవాగులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరం మోటర్లు ఆన్‌చేసి తమకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.
అర్వపల్లి, జూలై 12 : బీఆర్ఎస్ సర్కారు హయాంలో రైతులకు నీటి గోస తీరింది. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తిచేసిన కాళేశ్వరంతో తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలమైంది. నిరంతరం నీటి విడుదలతో రెండు సీజన్లలో పంటలు పుష్కలంగా పండాయి. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. సాగునీటికి నానా అవస్థ పడాల్సిన దుస్థితి వచ్చింది. బోర్లు వేసినా నీళ్లు పడక లక్షలు ఖర్చు పెట్టి బావులను తవ్వించాల్సి వస్తున్నది. ఒక్క బొల్లంపల్లి గ్రామంలోనే ఒక్కో రైతు 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు పెట్టి దాదాపు 10 బావులను తవ్వించారు. నాడు ఎస్సారెస్పీ కాలువల్లో నిండుగా నీళ్లు పారితే నేడు వానకాలంలోనూ బోసిపోయి కనిపిస్తున్నాయి. నాడు ఎండకాలంలోనూ చెరువులు గంగాళాల్లా కళకళలాడితే నేడు తాంబాళంలా వెలవెలబోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వానకాలం సీజన్ కూడా పంటలు ప్రశ్నార్థకమేనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కేసీఆర్ హయాంలో ఆరేడేండ్లపాటు రెండు పంటలకు కాళేశ్వరం నీళ్లు ఇస్తే కడుపునిండా పంటలు పండించుకున్నం. అంతకు మునుపు యాభై ఏండ్లు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి పంటలు ఎండుతున్నయ్. కేసీఆర్ హయాంలో వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాదని మీరంటున్నరు. మరి ఇప్పుడు ఏ నీళ్లిస్తవో ఇచ్చి ఆదుకో రేవంత్‌రెడ్డీ..!
– వీరబోయిన నాగయ్య తుంగతుర్తి రైతు