మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10 : ‘మేము బడ్జెట్ ప్రవేశపెడితేనే మీకు జీతాలు వస్తాయి? ఎక్స్‌ట్రాలు చేయకండి? ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా? అంటూ మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్‌పై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి చిటపటలాడారు. శుక్రవారం ఉదయం పాలమూరు ప్రభుత్వ జనరల్ దవాఖానలో ‘99 రోజుల ప్రజాపాలన-ప్రగతి కార్యక్రమం’లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా.. ముందుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. దీంతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేందర్, దవాఖాన సూపరింటెండెంట్ రంగా అజ్మీరా, వైద్యాధికారులు.. ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులను ఆహ్వానించేందుకు కారు వద్దకు వెళ్లారు.
‘ఫ్లెక్సీలో మేయర్‌తోపాటు నా ఫొటో ఎందుకు వేయలేదు? దవాఖాన ఆవరణలో ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తారు? మమ్మల్ని ఎందుకు పిలుస్తారు?’ అంటూ దవాఖాన సూపరింటెండెంట్‌పై డిప్యూటీ మేయర్ మండిపడ్డారు. ‘ఫోన్ చేసినా ఎందు కు లిఫ్ట్ చేయడం లేదు? అసలు నీ సంగతేంది? అం టూ ఆయన ఎమ్మెల్యే యెన్నం సమక్షంలో చిందులు తొక్కారు.
ఎమ్మెల్యే కలుగజేసుకొని మాట్లాడుతుండగానే వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ క్రిస్టినా వచ్చారని వైద్యాధికారులు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మా వల్లే జీతాలు వస్తున్నాయి. ఎక్స్‌ట్రాలు చేయొద్దు’ అంటూ చిటపటలాడారు. ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియాను ఉద్దేశించి ఫొటో తీయకండి.. అంటూ ముడా చైర్మన్ అడ్డుకున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే కలుగజేసుకొని.. ‘మా బాధలు కూడా మేము చెప్పుకోవద్దా? మీకు ఏం పని? ఇక్కడి నుంచి వెళ్లండి?’ అంటూ మీడియాపై చిర్రుబుర్రులాడారు.