హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డు భూములు మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. వివిధ ప్రాంతాల్లోని ఇంటి స్థలాలు (ప్లాట్లు), కమర్షియల్ స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కలిపి 11 ఆస్తులకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించడంతో రూ.65.02 కోట్ల ఆదాయం సమకూరినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ శాఖ కమిషనర్ వీపీ గౌతం వెల్లడించారు. గచ్చిబౌలిలోని 3,271 చదరపు గజాలు, చింతల్లోని 799.98 చదరపు గజాల స్థలాలతోపాటు నిజాంపేటలో 1,653 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్లకు కేపీహెచ్బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన వేలంలో 55 మంది పాల్గొన్నట్టు తెలిపారు. గచ్చిబౌలిలోని ఓ కమర్షియల్ ప్లాట్ రూ.33 కోట్లు, మరో చోట ఇంకో ప్లాట్ రూ.13.51 కోట్లు, రెండు ఎంఐజీ ప్లాట్లు దాదాపు రూ.4.50 కోట్ల ధర పలికినట్టు వివరించారు.