హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూర్తిగా డబ్బులు చెల్లించి దాదాపు 15 ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోర్టు కేసుల సాకుతో అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 2003-2006 మధ్యకాలంలో హౌసింగ్ బోర్డు 21 జేవీ ప్రాజెక్టులు చేపట్టగా.. రెవెన్యూ షేరింగ్ మాడల్‌లో చేపట్టిన ప్రాజెక్టుల్లో జేవీ భాగస్వామ్య కంపెనీలు సొమ్ముచేసుకొని చేతులెత్తేశాయి.
జేవీ ప్రాజెక్టుల్లో 2009-10 వరకు నిర్మాణాలు, కొనుగోళ్లు కొనసాగాయి. జేవీ భాగస్వామ్య సంస్థలు ఒప్పందాలను ఉల్లంఘించి కోర్టులను ఆశ్రయించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో 6 జేవీ ప్రాజెక్టుల్లో దాదాపు 1,000 ఫ్లాట్ల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జేవీ భాగస్వాముల నుంచి హౌసింగ్ బోర్డుకు దాదాపు రూ.589 కోట్లు రావాల్సి ఉన్నది. కానీ, ఆ సొమ్మును చెల్లించకుండా భాగస్వామ్య కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కమర్షియల్ స్పేస్‌ను, ఫ్లాట్లను విక్రయించిన అనంతరం ఒప్పందం ప్రకారం హౌసింగ్ బోర్డుకు చెల్లించాల్సిన డబ్బును డెవలపర్లు చెల్లించలేదని అధికారులు చెప్తున్నారు.
జేవీ ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం వస్తుందని హౌసింగ్ బోర్డు అంచనా వేసుకోగా.. రూ.430 కోట్లు మాత్రమే వచ్చింది. ఫ్లాట్ల కొనుగోలుదారులు 2010 నుంచి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై హౌసింగ్‌బోర్డు అధికారులను వివరణ కోరగా.. కోర్టు కేసులు తేలేవరకు తామేమీ చేయలేమని చెప్తున్నారు. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్లు కాకపోవడంవల్ల తమ ఆస్తులకు సరైన విలువ రావడంలేదని, హౌసింగ్ బోర్డు ప్రభుత్వరంగ సంస్థ అనే నమ్మకంతోనే తాము ఫ్లాట్లు కొనుగోలు చేశామని చెప్తున్నారు.