హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్ జర్నలిస్టులకు శుభవార్త. దశాబ్దానికి పైగా అపరిష్కృతంగా ఉండిపోయిన జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సంబంధించిన కేసు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యక్తిగతంగా తీసుకొన్న చొరవతో పరిష్కారానికి నోచుకొన్నది. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల స్వాధీనానికి, నిర్మాణాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఆయా స్థలాలను అలాట్ చేసుకోవచ్చని, అభివృద్ధి చేసుకొని, వ్యక్తిగతంగా ఇండ్లు నిర్మించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే బదలాయించిన నిజాంపేటలోని 32 ఎకరాలకు తోడుగా పేట్బషీరాబాద్లో కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని కూడా బదలాయించాలని తెలిపింది. ఈ 70 ఎకరాల భూమిని జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులకు అలాట్ చేసి, ఇండ్ల నిర్మాణాలు చేపట్టవచ్చునని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తి హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం తీర్పుచెప్పింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో న్యాయవాదులు సమర్థమైన వాదనలు వినిపించడంతో సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేసులో సానుకూల తీర్పు వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జర్నలిస్టుల జీవన ప్రమాణాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ఈ కేసులో కీలకంగా మారింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజాప్రతినిధులతో ముడిపెట్టకూడదని సీజేఐ రమణ అన్నారు. జర్నలిస్టులకు 12 ఏండ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన సంగతిని గుర్తు చేశారు. తాను ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి మాట్లాడడం లేదని అన్నారు. ఒక చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. రూ.8 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. జర్నలిస్టులంతా కలిసి ఆ స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారని, తమకు కేటాయించిన స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి తాము అనుమతిస్తున్నామని తెలిపారు. వారికి కేటాయించిన ఆ స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చునని సీజేఐ స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన మిగతా కేసును మరో బెంచ్‌కు బదిలీ చేసి, అక్కడ విచారణ జరపాలని ఆదేశించారు.
మీడియా అకాడమీ విజయం
ఇది తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తర్వాత ఏర్పడిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్, ఆ తర్వాత ఏర్పడిన మీడియా అకాడమీ విజయంగా భావిస్తున్నానని అల్లం నారాయణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాత జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం, మీడియా అకాడమీలతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత, జర్నలిస్టు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధ్యక్షతన కొత్త కమిటీ ఏర్పడిందన్నారు. కమిటీ అధ్యక్షుడు క్రాంతి సీఎం కేసీఆర్, ఇతర ప్రముఖులతో చర్చలు, తరువాత అందరి సహాయ సహకారాలతో, ఇన్నాళ్లకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషకరమని చెప్పారు.
మనందరి విజయం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
యూనియన్లు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం మనందరి విజయమని, దీనిని అందరూ ఆహ్వానించాలని సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. డబ్బులు కట్టి 13 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. డబ్బులు సర్దలేక, భార్య పుస్తెలు తాకట్టు పెట్టి 2లక్షలు కట్టిన వారి కల సాకారమయ్యే రోజు వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డబ్బులు కేటాయించి, ఇండ్ల స్థలాలకు ఫెన్సింగ్ వేసిన హెచ్ఎండీఏకు, కేసు పరిషారంలో సహకరించిన ఢిల్లీ జర్నలిస్టులకు, ఓపికగా పనిచేసిన సెక్రటరీ వంశీకి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ అఫిడవిటే కీలకం: వంశీ
తీర్పు అనుకూలంగా రావడానికి తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల జీవన ప్రమాణాలు తెలియజేస్తూ ఇచ్చిన అఫిడవిట్ కీలకంగా నిలిచిందని సొసైటీ సెక్రటరీ వంశీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వా త తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. సమావేశంలో జర్నలిస్ట్ నాయకులు మారుతిసాగర్, బసవ పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే హర్షం
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేసును సుప్రీంకోర్టు పరిష్కరించడంపై టీయూడబ్ల్యూజే ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేసింది. తీర్పు వెలువరించడానికి సకాలంలో అఫిడవిట్ వేసి సహకరించిన సీఎస్‌కు, ఆదేశాలిచ్చిన సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే విరాహత్ అలీ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్షీరాభిషేకాలు
తమ పన్నెండేండ్ల కల నెరవేరడంతో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఈ కేసు పరిష్కారంలో చొరవ తీసుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్‌తోపాటు సూర్యాపేట, హనుమకొండ, మహబూబ్‌నగర్, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో జర్నలిస్టులు క్షీరాభిషేకాలు చేశారు. సీఎం కేసీఆర్‌తోపాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జర్నలిస్టు సంఘాల పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రత్యేక కృషి చేసిన సీఎం కేసీఆర్
2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత పాతభవనంలోని మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం ఏవిధంగా చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని మాట్లాడారని అల్లం నారాయణ తెలిపారు. ఈ తీర్పు క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ ఎనిమిదేండ్లలో జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యపై 10 సార్లు చర్చించారని, ఈ ఆటంకం తొలుగుతుందని భరోసా ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు సమస్య కొలిక్కి వచ్చిందన్నారు. ఇందుకోసం కృషి చేసిన ఎమ్మెల్యే క్రాంతికి, వంశీకి అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల ఇండ్ల సమస్యపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌తో అనేకసార్లు చర్చలు జరిపామని చెప్పారు. ప్రతి సందర్భంలో కేటీఆర్ ఇండ్ల స్థలాలపై భరోసా ఇచ్చారని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారం దొరికిందని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని అందరు జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపులో అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు.
విలక్షణమైన తీర్పు: అల్లం నారాయణ
జర్నలిస్టులను ప్రత్యేక క్యాటగిరీగా గుర్తిస్తూ విలక్షణమైన తీర్పు ఇచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ జర్నలిస్టులందరి తరఫున తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పుతో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య ఒక కొలిక్కి వచ్చిందన్నారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇది శుభదినమని పేర్కొన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు కనుక దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఉపయోగపడే అవకాశం ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లో 15 ఏండ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూములపై ఏర్పడిన వివాదానికి సుప్రీంకోర్టులో ఒక పరిష్కారం లభించినట్టయిందని అన్నారు. తీర్పు వచ్చిన తరువాత గురువారం సాయంత్రం సమాచార భవన్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో అల్లం నారాయణ, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కా్రంతి కిరణ్, సెక్రటరీ వంశీ, జర్నలిస్టు యూనియన్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో సంబంధం లేకుండా సామాన్య జర్నలిస్టులు ఇండ్లు నిర్మించుకోవడానికి అనుకూలంగా, ఇండ్ల స్థలాలు కేటాయించడానికి వీలుగా తీర్పు ఇచ్చినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. మిగతావాళ్ల నుంచి జర్నలిస్టులను విడదీయటం కలిసి వచ్చిందన్నారు. ఇది తక్కువ వేతనాలు పొందే 8 వేల మంది జర్నలిస్టుల సమస్య అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో ప్రశాంత్‌భూషణ్ లాంటి ప్రముఖ న్యాయవాదులు వాదించారని చెప్పారు.